బుర్రఉన్న నేతలు కూడా పరువు తక్కువ ప్రెస్ మీట్లా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో ఏ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా సరే దానికి సంబంధించిన స్క్రిప్ట్ తాడేపల్లిలో తయారై వస్తుందనే సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టిన నాయకులైనా మాటిమాటికి చేతిలో కాగితాలు చూసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. కేసులలో ఇరుక్కున్న కొంతమంది నాయకులు తాము ప్రెస్మీట్లు పెట్టినప్పుడు స్క్రిప్టులు మొత్తం తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చేవి అని విచారణలో తేల్చి చెప్పారు కూడా.

సహజంగానే లాజిక్ అనే మాటతో సంబంధం లేకుండా, మాటలకు తలా తోక లేకుండా తాడేపల్లి స్క్రిప్టులు.. కేవలం బురద చల్లుడు ఎజెండాతో తయారు అవుతాయి అనేది అందరికీ తెలుసు. అలా కాకుండా తమ స్వబుద్ధితో మాట్లాడగల నాయకులు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొందరు ఉన్నారు. నిరాధార చవకబారు ఆరోపణలు సాధారణంగా వారి నుంచి రావు. అలాంటిది ఇప్పుడు తమ పార్టీలోని బుర్ర ఉన్న నాయకులతో కూడా లాజిక్ లేని బురద చల్లుడు ప్రహసనం కొనసాగించడం ద్వారా వారి పరువు కూడా తీయడానికి తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్టులు ఉపయోగపడుతున్నాయి. రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తాజాగా చేసిన ఆరోపణలు ఇలాంటి అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కు చైర్మన్ గా నియమితులైన మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా అమలాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విశాఖపట్నంలో జగన్ మీద కోడి కత్తితో దాడి చేసిన శీను ఇంటికి వెళ్లి, అతడి మంచీచెడ్డా విచారించారు జగన్మోహన్ రెడ్డి ఎన్ఐఏ కోర్టుకు సహకరించకపోవడం వలన కోడి కత్తి శీను అన్యాయానికి గురయ్యారని ఆరేళ్లుగా విచారణ పూర్తికాకుండా అనవసరంగా జైల్లో మగ్గారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నట్లు కూడా ప్రకటించారు. అది వేరే సంగతి.

అయితే ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కోడి కత్తి శీను ఇంటికి వెళ్లడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతోంది. దానికి వారు ఎలాంటి రంగులు పులుముతున్నారంటే.. జగన్మోహన్ రెడ్డిని హత్య చేయించడానికి ఏబీవీ కుట్ర పన్నుతున్నారట! జగనన్న గెలవడం కోసమే తాను కోడి కత్తితో దాడి చేసి జాలి సృష్టించాలని అనుకున్నానని నిందితుడు శీను స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళాలు అతని తీరు పట్ల అమానుషంగా దుర్మార్గంగా వ్యవహరించాయి. అలాంటి అమాయకుడిని ఇంటికెళ్లి కలిస్తే అతని ద్వారా హత్య చేయించడానికి ప్లాన్ చేస్తున్నట్టు అవుతుందా అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం. శ్రీకాంత్ రెడ్డి వంటి నాయకుడి ద్వారా కూడా ఇలాంటి పసలేని ఆరోపణలు చేయించడం ఆయన పరువు కూడా తీసే వ్యవహారం అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories