తిరుపతిలో ‘పేమెంట్’ను బట్టి అసంతృప్తి!

తిరుపతిలో ఒక వెరైటీ కుట్ర రాజకీయం ఈసారి తెరమీదకు వస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిటింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కొడుకు, నగర డిప్యూటీ మేయర్  అభినయ్ రెడ్డిని జగన్ ఎంపిక చేశారు.

తండ్రీకొడుకులు ప్రచారంలో దూసుకెళుతున్నారు. అదే సమయంలో.. ఎన్డీయే కూటమి ఇంకా గందరగోళంలో ఉంది. ఆ పార్టీ తరఫున జనసేన ఈ సీటును దక్కించుకుంది. చిత్తూరులో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి శ్రీనివాసులును తిరుపతిలో కేండిడేట్ గా పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే తిరుపతిలో అసమ్మతి సెగలు పుడుతున్నాయి. నిజం చెప్పాలంటే.. ఈ అసమ్మతి సెగలను వైసీపీ ఎగదోస్తున్నట్టుగా కనిపిస్తోంది.

వైసీపీని అనుసరిస్తున్న కుట్ర కూడా భిన్నమైనది. ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే.. తిరుపతి నగర వ్యాప్తంగా ఆయన పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఫ్లెక్సిలు వెలిశాయి. జనసేన స్థానిక నాయకులు ఈ ఫ్లెక్సిలు వేయించినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ‘ఆరణి వద్దు’ అనే మాట తప్ప ఎవ్వరి పేరూ లేని ఈ ఫ్లెక్సిలను వైసీపీ నాయకులే వేయించినట్టుగా కూడా స్థానికంగా గుసగుసలు ఉన్నాయి. అలాగే వైసీపీ ప్రలోభాలకు లొంగి జనసేనలోని కాపు నాయకులు.. ఆరణికి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా కూడా పలువురు చెబెుతున్నారు.

తెలుగుదేశం పరిస్థితి కూడా అదే. అక్కడి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను చంద్రబాబునాయుడు పిలిపించి ముందుగానే ఆమెకు నచ్చజెప్పి పంపారు. అంతా సద్దుమణిగినట్టే కనిపించింది. కానీ తాజాగా ఆమె కూడా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు పునరాలోచించుకోవాలని, తిరుపతి స్థానాన్ని తనకే కేటాయించాలని కోరుతున్నారు. ఈ అసమ్మతి గానం వెనుక కూడా వైసీపీ కుట్రలు ఉన్నట్టుగా సమాచారం.

విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. వైసీపీ నాయకులు, తెదేపా జనసేన బిజెపి నాయకుల్ని ప్రలోభపెట్టి కోరుతున్నది ఒక్కటే. ‘మీరు మాకోసం ప్రచారం చేయొద్దు.. ఓట్లు వేయించొద్దు.. కానీ ఆరణికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండండి..’ అని తాయిలాలు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. తద్వారా.. ఎన్డీయే కూటమిలో ఐక్యత లేదని ప్రచారం చేసుకుంటూ లబ్ధి పొందాలని వారు ప్లాన్ చేస్తున్నారు. తెదేపాకు చెందిన సుగుణమ్మ గత ఎన్నికల సమయంలోనే.. అప్పటి ప్రత్యర్థి భూమన కరుణాకర రెడ్డితో లాలూచీ పడి ఆ సీటును వదిలేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ టికెట్ కావాలంటూ ఆమె చేస్తున్న రాద్ధాంతానికి విలువ లేకపోయినా, అనుమానాలు కూడా పుడుతున్నాయి. ప్రతి అసమ్మతి గానం వెనుక, వైసీపీ నుంచి పేమెంట్ ఉన్నదని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories