అసంతృప్తులు కనిష్టం.. అదే విజయ చిహ్నం!

కాపురం చేసే కళ కాలు తొక్కిన నాడే తెలుస్తుంది అన్నట్లుగా రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎలా పెర్ఫార్మ్ చేయబోతున్నది అనే సంగతి టికెట్ల కేటాయింపు సందర్భంలోనే బయటపడుతోంది. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో మిత్ర పక్షాలు ఉభయలకు కలిపి 31 స్థానాలు కేటాయించిన తెలుగుదేశం.. తతిమ్మా 144 స్థానాలలో 16 మినహా అన్నింటికీ అభ్యర్థులను ప్రకటించేసింది. అయితే అభ్యర్థుల ఎంపిక పట్ల ఇతర స్థానిక నాయకులలో అసంతృప్తులు ధిక్కారాలు అనేవి అతి కనిష్ట స్థాయిలో ఉన్నాయి.
మిత్రపక్షాలకు కేటాయించిన సీట్లలో మాత్రం కొన్నిచోట్ల అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. 144 ఎమ్మెల్యే సీట్లు అభ్యర్థులను ప్రకటిస్తే ఒకటి రెండు చోట్ల మినహా ఎక్కడా పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించే స్థాయిలో అసమ్మతి వ్యక్తం కావడం లేదు. ఆ ఒకటి రెండు సీట్లలో కూడా చంద్రబాబుకు వీరవిధేయులైన నాయకులే తమ ఆవేదన బయటపెడుతున్నారు. తాము ఇన్నాళ్లుగా పడిన కష్టానికి గుర్తింపు దక్కకపోయినప్పటికీ ఇండిపెండెంటుగా పోటీ చేసి ఆ సీటును గెలిచి తిరిగి చంద్రబాబుకే కానుకగా అందిస్తాం అనే మాటలు కూడా కొన్నిచోట్ల వినిపిస్తున్నాయి.
అయితే జనసేన బిజెపి లకు కేటాయించే సీట్ల దగ్గర కొంచెం ఎక్కువ తలనొప్పి ఏర్పడుతోంది. ఇప్పుడున్న సామాజిక పరిస్థితులు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసమ్మతి తెలుగుదేశానికి అనేక విధాలుగా లాభం ఇస్తుందనే నమ్మకం వారిలో చాలా కాలంగా ఉంది. పొత్తులు ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వస్తుందని విశ్వాసంతో వారు ఇన్నాళ్లు స్థానికంగా ప్రజల్లో ఉంటూ కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. పొత్తులు లేకుండా కూడా పార్టీ గెలుస్తుందనే భరోసా అనేక మంది నాయకులు అందిస్తూ వచ్చినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు చీలడానికి వీల్లేదు అనే ఏకైక లక్ష్యంతోనే పొత్తులు కుదుర్చుకున్నారు. ఈసారి తప్పకుండా గెలుస్తాం అనే నమ్మకంతో దాదాపుగా అన్ని నియోజకవర్గాలలోను తెలుగుదేశం నాయకులు చాలా కష్టపడి పునాదులు గట్టిపరుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు తమ సీటు జనసేనకు భాజపాకో కేటాయించడం వారికి మింగుడు పడడం లేదు. అందువల్ల కాస్త నిరసన జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి గానీ ఒకటి రెండు రోజుల్లోగా అవన్నీ సద్దుమణిగేలా చేయడం చంద్రబాబు నాయుడుకు పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


అతిచేస్తున్న వాళ్లంతా అమ్ముడుపోయినోళ్లేనా?

తిరుపతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో చిత్రమైన ఆందోళనలు నెలకొంటున్నాయి. చిత్తూరు సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీలో చేరడంతో పవన్ కల్యాణ్ ఆయనను తిరుపతి నుంచి పోటీచేయించడానికి ఎంపిక చేశారు. అయితే.. అక్కడ ఆరణికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున్న ఉద్యమాలు జరుగుతున్నాయి. జనసేన కార్యకర్తలు మాత్రమే కాదు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా రోడ్డు మీదికి వచ్చి.. ఆరణికి వ్యతిరేకంగా ఆందోళనలు నినాదాలు చేస్తున్నారు. తమాషా ఏంటంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ కు లోపాయికారీగా అమ్ముడుపోయిన కొందరు ఇలాంటి ఆందోళనలను ప్రేరేపిస్తున్నారా అనే అనుమానం పార్టీ వర్గాల్లో కలుగుతోంది.
ఎందుకంటే.. తిరుపతి నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన రెండు పార్టీలు కూడా పటిష్టంగానే ఉన్నాయి. కార్యకర్తలు పార్టీ అధినేతల నిర్ణయానికి కట్టుబడి ఉండే వారే. చంద్రబాబునాయుడు కొన్ని రోజుల కిందట అక్కడ టికెట్ ఆశిస్తున్న పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మరో నేత నరసింహ యాదవ్ లను పిలిపించి మాట్లాడారు. ఆ సీటును జనసేనకు కేటాయిస్తున్నట్టుగా వారికి క్లారిటీ ఇచ్చారు. పార్టీ గెలిచిన తర్వాత వారికి ఇవ్వగల ఇతర అవకాశాల గురించి క్లారిటీ కూడా ఇచ్చారు. అక్కడితో తెలుగుదేశాన్ని సర్దుబాటు చేయడం పూర్తయిపోయింది.
చంద్రబాబుతో భేటీ తర్వాత.. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పవన్ కల్యాణ్ వద్దకు కూడా వెళ్లి కలిసినట్టు, తిరుపతిలో అభ్యర్థిగా ఎంపిక చేసేట్లయితే జనసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ప్రచారం ఉంది. అయితే.. తెలుగుదేశం నుంచి ఫిరాయిస్తే స్వీకరించడానికి సిద్ధంగా లేనని పవన్ చెప్పి పంపారు. అక్కడితో తెలుగుదేశం వర్గాలు చంద్రబాబు నచ్చజెప్పినదానికి కన్విన్స్ అయినట్టే స్థానికంగా ప్రచారం జరిగింది. ఒకసారి సీటు తమది కాకుండాపోయిన తర్వాత.. జనసేన తరఫున ఎవరు పోటీచేసినా సహకరించేలా వాతావరణం ఉండాలి.
జనసేన తరఫున అక్కడ పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ తదితరులు సీటు ఆశించారు. ఇప్పుడు చిత్తూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును పవన్ కల్యాణ్ తిరుపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం వారిలోనే ఎక్కువ అసంతృప్తి కలిగించాలి. వారి ఆందోళన ఓకే గానీ, తెలుగుదేశం వర్గాలు కూడా ఆందోళనకు దిగడం ఆశ్చర్యకరం. కొందరు తెలుగుదేశం నాయకులు వైసేపీ వ్యూహాలకు అమ్ముడుపోయినందునే వారు మిగిలిన వారిని రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తున్నట్టుగా స్థానికంగా వినిపిస్తోంది.
ప్రస్తుతానికి ఆందోళనలు రోడ్డెక్కడం మాత్రమే కాదు, ఆరణి గో బ్యాక్ అనే ఫ్లెక్సి పోస్టర్లతో గోడలెక్కాయి కూడా. అటు చంద్రబాబునాయుడు గానీ, ఇటు పవన్ కల్యాణ్ గానీ.. తమ తమ పార్టీ వారితో ఎంత వేగం మాట్లాడి వారికి నచ్చజెప్పగలిగితే అంత బాగా విపక్ష కూటమికి సానుకూలత ఏర్పడుతుందని ప్రజలు అనుకుంటున్నారు.


వంగా గీతను మార్చే ఆలోచనలో జగన్!

తాను ఈ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీచేయబోతున్నట్టుగా పవన్ కల్యాణ్ ప్రకటించినప్పటినుంచి ఏపీ రాజకీయాల్లో రకరకాల ప్రకంపనలు మొదలయ్యాయి. ఆ నియోజకవర్గంలో ఎప్పటినుంచో పనిచేసుకుంటూ ఉన్న తెలుగుదేశం నాయకుడు వర్మ, ఆయన వర్గంలో రేగిన అసంతృప్తి ఒక ఎత్తు. వర్మను ఉండవిల్లి నివాసానికి పిలిపించి బుజ్జగించే ప్రయత్నంలో చంద్రబాబునాయుడు ఉన్నారు. అదే సమయంలో.. పవన్ కల్యాణ్ ను ఓడించేందుకు సర్వశక్తులూ ఒడ్డే ఉద్దేశంతో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పుడు మరింత జాగ్రత్తగా అక్కడి పరిణామాలను గమనిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఎంపీ వంగా గీతను చాన్నాళ్లకిందటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం అసెంబ్లీ ఇన్చార్జిగా నియమించింది. అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు ఈసారి టికెట్ నిరాకరించారు. వంగా గీత అప్పటినుంచి నియోజకవర్గంలో తిరుగుతూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే ఆమె మీడియా ముందుకు వచ్చారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓడించి గెలవబోయేది తానేనని వంగా గీత చాలా ధీమాగా చెప్పుకున్నారు. ప్రత్యర్థి ఎవ్వరైనా సరే విజయం మాత్రం తనదేనని కూడా అన్నారు.
ఆమె ధీమా బాగానే ఉంది. కానీ పిఠాపురంలో విజయం సాధించే విషయంలో వంగా గీతకు ఉన్నంత ధీమా, పార్టీ అధిష్ఠానానికి ఉన్నట్టుగా లేదు. అక్కడి ప్రత్యర్థి పవన్ కల్యాణ్ అని అర్థమైన తర్వాత ఇంకా గట్టి అభ్యర్థిని మోహరించే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలనే సామెతను వారు గుర్తు చేస్తున్నారు. అలాంటిది, పెద్ద ప్రత్యర్థి విషయంలో ఏమాత్రం లైట్ తీసుకునే అవకాశం లేదని, పవన్ ను ఖచ్చితంగా ఓడించేందుకు మరింత గట్టి అభ్యర్థిని ఎంపిక చేయాలని జగన్ భావిస్తున్నట్టు చెబుతున్నారు.
ప్రతిపక్ష కూటమిలో అందరికంటె పవన్ కల్యాణ్ తనకు ప్రధాన శత్రువు అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తూ ఉంటారు. ఆ పార్టీ మొత్తం కూడా ఆయన మీద అదే స్థాయిలో ఫోకస్ పెడుతుంటారు. జగన్ ప్రసంగాల్లో అయితే చంద్రబాబు మీదికంటె పవన్ మీదనే ఎక్కువ విమర్శలు దొర్లుతుంటాయి కూడా. అలాంటిది.. ఆయన నియోజకవర్గం తేలిన తర్వాత.. మరింత స్టా్రంగ్ కేండిడేట్ కోసం చూస్తున్నారు.
అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును ఇప్పటికే తప్పించారు. వంగా గీతకు అవసరమైతే మరో నియోజకవర్గం కేటాయించాలని అనుకుంటున్నారు. వంగా గీత , తాను పవన్ ను ఓడించాలని ఉత్సాహపడుతున్నారు గానీ.. ఓడించే అవకాశం టికెట్ రూపంలో ఆమెకు చివరిదాకా ఉంటుందో లేదోనని ప్రజలు అనుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories