రఘురామక్రిష్ణరాజు పేల్చిన బాంబు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బాగానే పనిచేస్తోంది. 60 రోజులు వరుసగా శాసనసభకు రాకపోతే అనర్హత వేటు తప్పదని రఘురామ అన్నారు. ఆ మేరకు జగన్ పై వేటు పడుతుందని చెప్పారు. కానీ.. జగన్ పురమాయింపు మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా శాసనసభకు వెళ్లడం లేదు. రఘురామ చెప్పిన నిబంధనే గనుక నిజమైతే.. వేటు జగన్ ఒక్కడి మీద ఎందుకు పడుతుందని.. తమందరి మీద కూడా పడుతుందని తాము మాజీలు కావడానికి సిద్ధంగా ఉండాలని వైసీపీ ఎమ్మెల్యేలు గుబులు పడుతున్నారు. జగన్ అహంకారం పుణ్యమాని పదుల కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన ఎమ్మెల్యే గిరీ కూడా జారిపోతే.. ఆ తర్వాత ఉపఎన్నికల్లో పోటీచేయడానికి నిధులు కూడా లేవని వారు భయపడుతున్నారు.
శాసనసభకు వెళ్లకపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి తప్పుడు విధానం అనే అభిప్రాయం పార్టీ ఎమ్మెల్యేల్లో ఉంది. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వెళ్తానని భీష్మించుకుంటే ఆయన ఇంట్లో కూర్చోవచ్చు గానీ.. తమందరినీ సభకు వెళ్లనివ్వకుండా కట్టడి చేయడం దుర్మార్గం అని వారు లోలోన కుమిలిపోతున్నారు. తాము సభలో ఒక్క సమస్య గురించి కూడా మాట్లాడకుండా అయిదేళ్లు గడిపితే.. ఆ తర్వాత ప్రజల ఎదుటకు ఏ మొహం పెట్టుకుని వెళ్లగలం అని వారు మధనపడుతున్నారు.
ఈలోగా వారికి రఘురామ పేల్చిన బాంబు చేదుమాత్రలా పనిచేస్తోంది. అయిదేళ్ల తర్వాత ఎన్నికలు జరిగితేనే తమ పరిస్థితి ఘోరం అనుకుంటుండగా.. అనర్హత కారణంగా పదువులు పోయి ఉప ఎన్నిక ఎదుర్కోగలమా? అని బాధపడుతున్నారు. జగన్ ఒకవైపు శాసనమండలిలో మాత్రం తమ పార్టీ ఎమ్మెల్సీలను సభకు పంపుతున్నారు. అక్కడ మెజారిటీ ఉంది గనుక పంపుతున్నారు. కానీ శాసనసభలో తమను కట్టడిచేస్తున్నారు. ఆయన సభకు వెళ్లకుండా మిగిలినవాళ్లు సభకు హాజరైతే ఆయనకు పరువు తక్కువ అనే భయంతోనే జగన్ ఇలా చేస్తున్నట్టు గా సొంత ఎమ్మెల్యేలే అనునమానిస్తున్నారు. మొత్తానికి … గైర్హాజరీల కారణంగా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు నిబంధన గురించిన వార్త.. ఇప్పుడు వైసీపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది.