ఎక్కువ మంది నేతలు బయటపడకపోయినప్పటికీ.. బీసీ సంఘాల నాయకుడు ఆర్.కృష్ణయ్య.. హెలికాప్టర్ లో ఆకాశమార్గంలో వచ్చి, తమ పార్టీలో చేరి, రాజ్యసభ ఎంపీ పదవిని గద్దలా తన్నుకుపోవడం అనేది కమలదళంలోని చాలా మంది నాయకులకు నచ్చడం లేదు. మామూలుగానే మోడీ భక్తిని ప్రదర్శించే విషయంలో తప్ప బిజెపి నాయకులు గుంభనంగా ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ ఎంపీ పదవి కట్టబెట్టడం పట్ల చాలా మంది సీనియర్లు లోలోన రగిలిపోతున్నారు. ఆయన అవకాశవాద రాజకీయ నాయకుడు అని, ఎలాంటి భావసారూప్యత లేకుండానే.. బీసీ నాయకుడు అనే భ్రమతో ఆయనను అడ్డదారిలో నెత్తిన పెట్టుకోవడం తగదని పలువురు భావిస్తున్నారు.
ఆర్.కృష్ణయ్య నిర్దిష్టమైన రాజకీయ భావజాలం ఉన్న వ్యక్తి కాదు. ఆయన కేవలం బీసీ సంఘాల నాయకుడుగా మాత్రమే అందరికీ పరిచితులు. రాజకీయ ఆసక్తి పుట్టిన తర్వాత.. ఆయన తెలుగుదేశంలో తొలి అడుగు వేశారు. తెలంగాణకు తెదేపా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనను ప్రకటించి పోటీకి దిగారు. ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ తెలంగాణలో ఓడిపోయిందని.. అప్పటికప్పుడే పార్టీకి దూరం జరిగారు. పార్టీ కార్యకలాపాలతో అంటీముట్టనట్టుగా ఉండిపోయారు. ఆయన అవకాశవాది అనడానికి ఇది తొలి ఉదాహరణగా కొందరు పేర్కొంటుంటారు.
జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా అదే రిపీట్ అయింది. తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్యను పిలిపించి.. ఏపీనుంచి రాజ్యసభ ఎంపీ పదవి కట్టబెట్టారు జగన్. తీరా ఏమైంది? సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం పాలవగానే.. ఆపార్టీకి గుడ్ బై కొట్టేశారు. మళ్లీ అవకాశవాదమే.
బిజెపి కేంద్రంలో బలంగా ఉన్న పార్టీ గనుక మాత్రమే ఇప్పుడు తమ పంచకు చేరారనేది ఏపీ బీజేపీలోని సీనియర్ల వాదన. చాలా మందిలో ఈ భావన ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బయటపడ్డారు. జగన్ రాజ్యసభ ఎంపీ పదవి కట్టబెట్టాక, పార్టీ ఓడిపోయినందుకు రాజీనామా చేయడం అనేది అనైతికం అని ఆయన అన్నారు. ఇది కేవలం కృష్ణయ్య మీద విమర్శ మాత్రమే కాదు.. అలాంటి అవకాశ వాదుల్ని చేరదీస్తున్నందుకు తమ పార్టీ అధిష్ఠానం మీద కూడా విమర్శ అని పలువురు అనుకుంటున్నారు.