చిన్నమ్మ ఆహ్వానంపై వైసీపీ నేతల్లో  చర్చోపచర్చలు!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బెంగళూరులోని యలహంక ప్యాలెస్ లో బిందాజ్ గా గడపడంపై ఉన్న మక్కువలో పదో వంతు కూడా పార్టీ పునర్నిర్మాణం మీద కనిపించడం లేదు. విదేశాలకు వెళ్లి విహారయాత్రలు తిరగాలని అనుకుంటున్నారు తప్ప.. తిరిగి పార్టీకి ప్రజాదరణ కూడగట్టడం ఎలా? అనే ఆలోచన చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ కార్యకర్తల మనోగతం ఎలా ఉంటుంది? జగనన్నను నమ్ముకుని ఇదే పార్టీలో కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్తు అంధకార బంధురం అయిపోతుందేమో అనే భయం సహజంగానే ఉంటుంది కదా! అవకాశం ఉంటే ఇంకో దారి చూసుకుని తమను తాము కాపాడుకోవడంపై దృష్టి పెడతారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో అదే జరుగుతోంది. ప్రత్యేకించి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తమ పార్టీ సిద్ధాంతాలను విశ్వసించి వచ్చే వైసిపి నాయకులకు స్వాగతం పలుకుతామని ప్రకటించిన నేపథ్యంలో, ఆ పార్టీ నాయకుల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

జగన్ మోహన్ రెడ్డి వైఖరితో విసిగి వేసారిపోయిన మాజీ ఎమ్మెల్యేలు పలువురు ఎన్నికల తర్వాతనే పార్టీకి గుడ్ బై కొట్టారు. ఇతర పార్టీల్లోకి ప్రవేశించే మార్గలేమీ చూసుకోకుండా.. కేవలం వైసీపీలో ఇమడలేక వారు బయటకు వెళ్లిపోయారు. కిలారు అంజయ్య, ఆల్ల నని, మద్ధాలి గిరి తదితరులు ఇందులో ఉన్నారు. మరెంతో మంది నాయకులు అసంతృప్తితో రగులుతున్నారు. అలాంటి వారికి పురంధేశ్వరి ఆహ్వానం కమ్మటి కబురు లాగా ధ్వనిస్తుంది.

బిజెపి సిద్ధాంతాల పట్ల విశ్వాసం వ్యక్తం చేయడానికి ఎవ్వరికీ పెద్దగా అభ్యంతరం లేదు. కాకపోతే కూటమి ప్రభుత్వం నుంచి తమ మీద కేసుల ముప్పు రాకుండా చూసుకుంటే చాలుననే ఉద్దేశంతో ఉన్నారు. ఆల్రెడీ పలువురు సీనియర్ వైసిపి నాయకులు కమల దళం పెద్దలతో టచ్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. బీజేపీలో చక్రం తిప్పగలిగిన కొందరు నాయకులు ప్రత్యేకంగా వైసిపి నాయకులకు ఫోన్లు చేసి మరీ ఆహ్వానం పలుకుతున్నట్టు పుకార్లు వస్తున్నాయి. జగన్ తో భవిష్యత్తు లేదనుకుంటున్న వారికి  వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు గనుక.. బిజెపిలోకి వలసలు పోటెత్తుతాయని పలువురు అంచనా వేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories