వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్ దళాలు ఎంతటి వక్రనీతులతో వర్తిస్తున్నాయో తెలుసుకోవడానికి ఇది పెద్ద ఉదాహరణ. లిక్కర్ కుంభకోణంలో.. కర్త కర్మ క్రియ అన్నీ తానై నడిపించిన కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి నెలలపాటూ పరారీలో ఉంటూ పోలీసులతో ఒక ఆట ఆడుకున్నాడు. పోలీసులు అతనికంటె తెలివిగా ఆలోచించి.. అరెస్టు చేయబట్టి ఇప్పుడు కటకటాల్లో ఉన్నాడు. అయితే కెసిరెడ్డి రాజ్ విచారణలో ఉండగా.. పోలీసుల విచారణకు విజయవాడ వచ్చిన ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డి.. చాలా అమాయకంగా తన కొడుకు ఎప్పుడు ఎక్కడకు వెళుతున్నాడో తనకు చెప్పడని, కొన్ని నెలలుగా కొడుకుతో పెద్దగా సంబంధాలు కూడా లేవని చాలా రకాల మాటలు వల్లించారు. మొత్తానికి తన కొడుక్కి సమాచారం చేరవేయడానికి ప్రయత్నిస్తానని చెప్పి వెళ్లారు. తీరా కొడుకును అరెస్టు చేసి రిమాండులో పెట్టేసరికి.. తన కొడుకును అక్రమంగా రిమాండులో పెట్టారని, ఆ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు ఆయన.
రాజ్ కెసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి తాజాగా హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. కొడుకును అరెస్టు చేసేప్పుడు తెలిపిన కారణాల్లో కేవలం ఐపీసీ సెక్షన్లు మాత్రమే పేర్కొన్నారని, రిమాండ్ రిపోర్టులో మాత్రం అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు కూడా చేర్చారని ఆయన ఆరోపించారు. బీఎన్ఎస్ఎస్ లో పేర్కొన్న నిబంధనలను అరెస్టు సమయంలో పోలీసులు పాటించలేదు గనుక.. రిమాండును చట్టవిరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలనేది ఆయన డిమాండు. ఏసీబీ కోర్టు ఇవేమీ పట్టించుకోకుండానే రిమాండు విధించనేది ఆయన ఆరోపణ.
ఇంతకూ రాజ్ కెసిరెడ్డి రిమాండు అక్రమమో సక్రమమో హైకోర్టు ఈ పిటిషన్ పై వాదనలు విన్నప్పుడు తేలుతుంది. కానీ.. కెసిరెడ్డి తండ్రిని అడ్డు పెట్లుకుని ఒక ఎమోషనల్ డ్రామా ఆడించడానికి జగన్ దళాలు చేస్తున్న కుటిల యత్నాలు ఇక్కడ బయటపడుతున్నాయి. ఇదే సమయంలో సామాన్య ప్రజలకు కొన్ని కొత్త సందేహాలు కలుగుతున్నాయి.
కోడికత్తి శీను పాపం అన్యాయంగా కొన్ని సంవత్సరాల పాటు జైల్లోనే మగ్గిపోయాడు. కేవలం జగన్ కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పకపోవడ వల్ల.. అతడు చేసిన పని హత్యాప్రయత్నమో కాదో తేలకుండా అతను జైల్లో సంవత్సరాల తరబడి మగ్గవలసి వచ్చింది. ‘నన్ను చంపేయడానికి అతడి చేతికి కోడికత్తి ఇచ్చి తెలుగుదేశం వాళ్లే పంపారు బాబోయ్’ అంటూ నానా గోలచేసి ప్రజల సానుభూతి గెలుచుకుని సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి.. అతడిని జైల్లోనే సంవత్సరాలు మగ్గేలా క్రూరంగా వ్యవహరించారు. తమ కొడుకు విడుదలకు సహకరించాలని.. చిన్న పొరబాటు చేసిన కోడికత్తి శీను తల్లిదండ్రులు సంవత్సరాల తరబడి మొత్తుకున్నా జగన్ మనసు కరగలేదు. ఇప్పుడు వేల కోట్ల రూపాయలు కాజేసినట్టు స్పష్టంగా తేలిపోయిన కేసులో అసలు నిందితుడు రాజ్ తరఫున మాత్రం అతడి తల్లిదండ్రులతో ఎమోషనల్ డ్రామా ఆడిస్తున్నారు.. అంటూ ప్రజలు చీదరించుకుంటున్నారు.