వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిదేళ్ల పాటు పరిపాలన సాగించారు. ముఖ్యమంత్రిగా పరిపాలన అంటే.. ప్రజల జేబుల్లోకి ప్రభుత్వం సొమ్మును బటన్ నొక్కి పంపేయడం మాత్రమే అని ఆయన బలంగా అనుకున్నారు. జనానికి సర్కారు సొమ్ము ప్రతినెలా పంచుతూ ఉంటే.. వారు తనకు రుణపడి తన ఫోటో పెట్టి పూజిస్తారని జగన్ భావించారు.
ఈ ధోరణులను ప్రశాంత్ కిశోర్ కూడా తప్పు పడుతూ.. జగన్ తనను తాను దేవుడిలాగా, అందరికీ అన్నీ అందించే రాజులాగా భావించుకుంటున్నారని ఎద్దేవా చేసిన సంగతి అందరికీ గుర్తుంటుంది. డబ్బు పంచడం మీద ఉన్న శ్రద్ధను జగన్ పరిపాలన మీద పెట్టలేదు. అభివృద్ధి మీద పెట్టలేదు. రాష్ట్రంలో రోడ్లన్నీ అధ్వానంగా తయారై సర్వనాశనం అయినా.. కనీస మరమ్మతుల గురించి కూడా ఆయన పట్టించుకోలేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆరునెలల పాలన కాలంలో.. 3750 కిలోమీటర్ల సీసీరోడ్లు నిర్మించడం అంటే.. అలాంటి పరిణామాన్ని ఎవరైనా ఊహించగలరా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
ఇలాంటి అరుదైన ఘనతను ఎన్డీయే కూటమి ప్రభుత్వం సాధించింది. ఆ రకంగా రికార్డు నమోదు చేసింది. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా ఈ వివరాలు వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారు అయిదేళ్ల పదవీకాలంలో కేవలం 1800 కి.మీ.ల సీసీ రోడ్లను నిర్మించగా, ఎన్డీయే సర్కారు ఆరునెలల్లోనే 3750 కిమీల రోడ్లు వేసినట్టుగా ఆయన తెలియజేశారు.
గ్రామీణ రోడ్లు అభివృద్ధికి చిహ్నాలు అని పెద్దలందరూ అంటారు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియని సంగతి కాకపోవచ్చు. కానీ.. ఆయన ప్రాధాన్యాల జాబితాలో అభివృద్ధి అనే మాట లేకుండా పోయింది. అందుకే వీసమెత్తు నిర్మాణాత్మక పనులు చేపట్టకుండానే.. ఆయన అయిదేళ్ల పదవీకాలం కేవలం డబ్బుల పంపకాలతో ముగించారు.
అప్పట్లో రోడ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. పెద్ద పెద్ద గోతులు పడ్డాయి. ఆ గోతుల్లో పడి ప్రజలు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనలు కూడా అనేకం జరిగాయి.
అయినా జగన్ కు చీమకుట్టినట్టయినా పట్టలేదు. నీరోచక్రవర్తిలాగా వ్యవహరించారు. కూటమిసర్కారు రాగానే.. సంక్రాంతిలోగా గ్రామీణ రోడ్లను మరమ్మతు చేస్తాం అని చంద్రబాబునాయుడు ప్రకటించారు. వేలకిలోమీటర్ల రోడ్లకు మరమ్మతులు జరిగాయి. గ్రామీణ రోడ్లు ఇప్పుడు కళకళలాడుతున్నాయి. వాటికి తోడు పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ఏకంగా 3750 కిలోమీటర్ల సీసీరోడ్లను ఆరునెలల్లోనే నిర్మించడం అనేది చిన్న సంగతి కాదు. ఈ విజయాలను చూసి.. జగన్ పరిపాలన కాలంలో ఎన్నడైనా ఇలాంటి పరిస్థితులను ఊహించగలిగామా అని ప్రజలు అనుకుంటున్నారు.