పులివెందుల జడ్పీటీసీ స్థానానికి సంబంధించి రెండు పోలింగ్ కేంద్రాల పరిధిలో బుధవారం నాడు రీపోలింగ్ జరిగింది. నిన్నటి పోలింగ్ పారదర్శకంగా, పటిష్ట భద్రత మధ్య, తాము రిగ్గింగ్ చేసుకోవడానికి ఎలాంటి ఆస్కారం లేకుండా జరగడంతో.. ఓటమి తప్పదని ఫిక్సయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఇవాళ్టి రెండు కేంద్రాల రీపోలింగును బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. అయితే కాస్త జాగ్రత్తగా గమనిస్తే.. పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని కోల్పోతున్నట్టుగా వారికి ముందుగానే అర్థమైందేమో అనిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ ఓటమి తప్పదని తెలిసిపోయి, మంగళవారం నాటి పోలింగ్ సమయంలో కూడా వారు వ్యూహాత్మకంగా వ్యవహరించారని, తమ వ్యూహంలో భాగంగానే పోలింగ్ ఏజంట్లకు తదనుగుణమైన ట్రైనింగ్ ఇచ్చి పంపించారని పలువురు అనుకుంటున్నారు.
చాలా పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పోలింగ్ ఏజంట్లు అవనసరమైన రాద్ధాంతమూ, హడావుడీ చేశారు. చాలా చోట్ల వారు అసలు పోలింగ్ కేంద్రాల లోనికి వెళ్లనే లేదు. లోనికి వెళ్లకుండా.. బయట నిల్చుని సాక్షి కెమెరాలతో మాట్లాడుతూ.. తమను వెళ్లనివ్వడం లేదని నిందలు వేయడమే పనిగా గడిపేశారు. గట్టిగా అరిస్తే.. అది నిజం అని అవతలి వారు అనుకుంటారనే భ్రమలో కొందరు బతుకుతూ ఉంటారు. మంగళవారం నాటి పోలింగ్ సమయంలో కొందరు వైసీపీ ఏజంట్లు అలా కనిపించారు. బుధవారం నాడు ప్రెస్ మీట్ పెట్టిన జగన్ మాటలను గమనిస్తే.. ఏజంట్లు వ్యవహరించిన తీరు మొత్తం ఒక వ్యూహం ప్రకారం జరిగినదే అని అనిపిస్తోంది.
మంగళవారం నాడు వైసీపీ పోలింగ్ ఏజంట్లు రెండు రకాలుగా వ్యవహరించారు. కొందరు పోలింగు కేంద్రంలోకే వెళ్లకుండా బురద చల్లాలని చూస్తే.. లోనికి వెళ్లిన వారు అక్కడ ఏదో ఒక రచ్చ చేయడానికి, అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించారు. ఘర్షణలకు కారణం అయ్యారు. ఇది వైసీపీ తమ ఏజంట్లకు ముందుగానే ట్రైనింగ్ ఇచ్చి అనుసరించిన ద్విముఖ వ్యూహం అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఎందుకంటే.. జగన్మోహన్ రెడ్డి బుధవారం నాటి ప్రెస్ మీట్ లో అనేక రకాల నిందలు వేశారు. అందులో భాగంగా.. తమ పార్టీకి చెందిన ఏజంట్లు లేకుండానే నిర్వహించిన ఎన్నికలను అసలు ఎన్నికలని అంటారా? అంటూ ఆయన నిలదీశారు.
ఆ ప్రశ్న తర్వాతనే నిన్నటి పరిణామాలు అనుమానాలు పుట్టిస్తున్నాయి. ఎందుకంటే.. ఓ మహిళా పోలింగ్ ఏజంట్ నిన్న సాక్షి టీవీలో చాలా యాగీ చేశారు. పోలీసులను తీవ్రంగా నిందించారు. తమను పోలింగ్ స్టేషన్లోకి అనుమతించడం లేదని ఆరోపణలు చేశారు. నువ్వు రామ్మా పోలింగుకు రామ్మా అని ఒకవైపు పోలీసు అధికారి పదేపదే బతిమాలడం సాక్షి వీడియోలోనే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె పోలింగ్ కేంద్రానికి వెళ్లకుండా.. తమను లోనికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలు చేయడం అసలు తమాషా. పోలీసులు పిలిచినా కూడా వెళ్లకపోవడం ఈ కుట్రలో భాగమే అని అంతా అనుకుంటున్నారు. కొందరిని పోలింగుకు వెళ్లవద్దని, కొందరిని రచ్చ చేయమని ముందే చెప్పిపంపి.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు జరిగిన తీరు గురించి విమర్శలు చేస్తూ తన కపటబుద్ధిని చాటుకుంటున్నారని అంతా అంటున్నారు.