తొలిసారి ఎమ్మెల్యేగానే ఆమె అన్ని దందాలు చేశారా?

దందాలు సాగించడానికి, కోట్ల రూపాయల్లో తలచినంత సొమ్ము వసూలు చేయడానికి.. ఎన్నెన్ని అడ్డదారులు తొక్కారో.. ప్రభుత్వ యంత్రాంగాలను కూడా అక్రమంగా ఎలా వాడుకున్నారో.. విడదల గోపీనాధ్ రిమాండు రిపోర్టును పరిశీలిస్తే అర్థమవుతుంది. మాజీ మంత్రి విడదల రజని.. తాను ఎమ్మెల్యేగా ఉండగా.. రెండు కోట్ల రూపాయల ముడుపులు స్వీకరించిన కేసులో.. ప్రత్యక్ష పాత్రధారి ఆమె మరిది గోపీనాధ్ ను అరెస్టు చేసిన పోలీసులు.. ఆయనను కోర్టు ఎదుట ప్రవేశపెట్టే సందర్బంగా రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. కేవలం తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లోనే విడదల రజని ఎంత దారుణంగా తెగించి దందాలు చేశారో దీన్ని చూస్తే అర్థమవుతుంది.

రిమాండు రిపోర్టు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
విడదల రజని ఎమ్మెల్యే కాగానే.. లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానులను పీఏ ద్వారా.. తన వద్దకు పిలిపించుకున్నారు. 2020 సెప్టెంబరు 4న క్రషర్స్ లోని పార్టనర్ చలపతిరావు ఆమె కార్యాలయానికి వెళ్లారు. అడిగినంత డబ్బు తనకు ఇవ్వాలని లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మీ క్రషర్ సవ్యంగా నడవాలంటే 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత సరిగ్గా 6 రోజులకు అంటే పదో తేదీన.. గుంటూరు జిల్లా ఆర్‌వీఈవో పల్లె జాషువా తన సిబ్బందితోను, రెవెన్యూ అధికారులతోను కలిసి క్రషర్స్ మీద దాడిచేసి తనిఖీలు నిర్వహించారు. నిబంధనల ప్రకారం అలా తనిఖీలకు వెళ్లడానికి ఆయన ఆ శాఖ డీజీ నుంచి అనుమతి తీసుకోలేదు. తనిఖీలుచేసినట్టుగా ఆఫీసు రికార్డుల్లో ఎక్కడా రాయలేదు. తనిఖీలు చేసి వెళ్లిన తర్వాత.. క్రషర్స్ యజమానులకు ఫోను చేసి.. ఎమ్మెల్యేతో సెటిల్ చేసుకోండి.. లేదంటే క్వారీపై కేసు పెట్టి, 50 కోట్ల జరిమానా విధిస్తా అంటూ జాషువా బెదిరించారు. వేరే గతిలేక క్రషర్స్ యజమానులు విడదల రజనికి 2 కోట్లు, ఆమె మరిది గోపి, జాషువాలకు చెరి పది లక్షలు వంతున చెల్లించారు.

విడదల రజని సూచించినట్లుగా 2021 ఏప్రిల్ 4 న రాత్రి పురుషోత్తపట్నంలోని విడదల గోపి నివాసానికి వెళ్లి రెండు కోట్లు ఇచ్చారు. గోపి తన ఫోను నుంచే రజనికి కాల్ చేసి.. డబ్బు అందినట్టుగా ధ్రువీకరించారు. రెండు రోజుల తర్వాత జాషువా నివాసానికి, గోపి నివాసానికి వెళ్లి.. వారికి చెరి పదిలక్షల వంతున ఇచ్చారు.
తొలిసారిగా ఎమ్మెల్యేగా అయిన మహిళే ఈ స్థాయిలో దందా చేయడం అనేది పలువురికి ఆశ్చర్యం కలిగిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యేలు ఒకరిని చూసి మరొకరు ఇన్‌స్పైర్ అయి.. విచ్చలవిడి దందాలు చేశారని.. ఏమాత్రం వెరపు లేకుండా వ్యవహరించారని తెలుస్తోంది. గోపీ విచారణలో కొన్ని వివరాలు వెల్లడించిన తర్వాత.. ఇక మాజీ మంత్రి రజని అరెస్టు పర్వం ఎప్పుడు ఉంటుందోనని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories