కర్ణాటకలోని కాంగ్రెస్ ఉద్ధండులతో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. వైఎస్సార్ పట్ల వారిలో గౌరవం ఉంది. దాన్ని బట్టి ఆయన పిల్లలతో సత్సంబంధాలు ఉన్నాయి. వైఎస్ షర్మిల తెలంగాణలో ఒక విఫల పార్టీని నడిపిన తర్వాత.. దానిని కాంగ్రెసులో విలీనం చేయడానికి కీలకంగా వ్యవహరించినది కూడా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అనే వాదన ఉంది. ఆమెను ఏపీసీసీ సారథి చేయడం వెనుక కూడా ఆయన హస్తం ఉన్నదని అంటూ ఉంటారు. అయితే అదే డీకే శివకుమార్ తో వైఎస్ జగన్ కు కూడా అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ కన్నడ సంబంధాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అన్నా చెల్లెళ్ల తగాదాను కొంత మేర ప్రభావితం చేస్తున్నాయా? అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది.
సాధారణంగా పీసీసీ చీఫ్ ను ఏమైనా నిందిస్తే.. ఆ పార్టీ వారు ఆమెకు మద్దతుగా గళం విప్పాలి. ఆమె రాష్ట్ర పార్టీకి సారథి అయినప్పుడు.. ఆమెకు అండగా పలువురు ముందుకు రావాలి. అలాగని.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు దిక్కులేని పార్టీలాగా అయిపోలేదు. ఆ పార్టీకి ప్రజల్లో బలం, ఓట్లు లేకపోవచ్చు గానీ.. అంతో ఇంతో నాయకులు పుష్కలంగానే ఉన్నారు. వైఎస్ఆర్ జమానా నాటి నాయకులు రఘువీరారెడ్డి, చింతామోహన్, శైలజానాధ్, గిడుగు రుద్రరాజు, పల్లం రాజు, హర్షకుమార్, తదితర నాయకులు ఎందరో ఉన్నారు. అందరికంటె మించి.. వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా తన ఆత్మ అని చెప్పుకున్న కేవీపీ రామచంద్రరావు లాంటి వారు కూడా ఉన్నారు. కానీ వారెవ్వరూ కూడా రష్మిలకు అనుకూలంగా ఒక్క మాట మాట్లాడలేదు. దీనిని బట్టి.. ఈ వ్యవహారం ఆమె సొంత గొడవ అనీ.. అందులో పార్టీ జోక్యం చేసుకోకూడదని అధిష్ఠానం నిర్ణయించిందా? అనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది.
ఇదే సమయంలో.. పార్టీ అలా నిర్ణయించేలా జగన్మోహన్ రెడ్డే తన బెంగుళూరు సంబంధాల ద్వారా చక్రం తిప్పారా? అనే అనుమానాలు కూడా పలువురికి కలుగుతున్నాయి. డీకే శివకుమార్ ద్వారా.. ఏపీ కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ తమ కుటుంబ వ్యవహారంలో కామెంట్లు చేయకుండా ఒక అప్రకటిత నిబంధన విధింపజేశారా? ఆ రకంగా షర్మిలను ఒంటరి చేశారా? అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది.
జగన్ కక్ష కడితే గనుక.. సంపూర్ణంగా ఆమె పతనం చూడడానికి నిర్ణయించుకుంటారని.. కాంగ్రెసు పార్టీలో కూడా ఆమెకు భవిష్యత్తు లేకుండా చేయగలరని కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. షర్మిల వలన పార్టీకి గొప్పగా వచ్చే మేలు ఏమీ లేదని కాంగ్రెస్ కు గత ఎన్నికల్లోనే స్పష్టత వచ్చింది. ఇప్పుడు ఆమెను వదిలించుకున్నా కూడా ఆశ్చర్యం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు. అలా జరిగితే, అందులో కూడా జగన్ హస్తం ఉన్నప్పటికీ ఆశ్చర్యం లేదంటున్నారు.