పోలీసులు కట్టుబానిసలు అనుకున్నారా జగన్!

అయిదేళ్ల పరిపాలన కాలంలో జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా చెలరేగుతూ.. పోలీసు వ్యవస్థను మొత్తం తన చెప్పు చేతల్లో ఉంచుకుని పనిచేయించుకున్నారని, తన ప్రత్యర్థులను వేధించడానికి కీలుబొమ్మల్లాగా వాడుకున్నారని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే, ఆయన అరాచకాల్ని సహించలేక ప్రజలు దారుణంగా తిరస్కరించిన తర్వాత కూడా ఆయనలో ఏమాత్రం సదాలోచన వచ్చినట్టు లేదు. బుద్ధి మారినట్టు లేదు. పోలీసులను తన పాలేర్లలాగా వాడుకోవడమే కాదు.. తన పార్టీలోని మామూలు కార్యకర్తలకు కూడా గులాములుగా పనిచేయాలనేలా ఆయన మాట్లాడుతున్నారు. ‘మూడేళ్లలో మళ్లీ అధికారంలోకి వచ్చి అదే డీఎస్పీతో నీకు సెల్యూట్ కొట్టిస్తా’ అని జగన్మోహన్ రెడ్డి వేసిన పంచ్ డైలాగు ఒక ప్రమాద సంకేతంలాగా కనిపిస్తోంది. తమ ఖర్మగాలి ఒకవేళ మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే గనుక.. తమ బతుకులు కట్టుబానిసల్లాగా తయారవుతాయేమోనని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

సాధారణంగా రాజకీయ నాయకులు ఎప్పుడూ కూడా.. తమ ప్రత్యర్థుల మీదకు పోలీసులను ప్రయోగించినప్పుడు.. ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అనే మాట చెబుతూ తప్పించుకుని తిరుగుతుంటారు. ప్రతిపక్షంలో ఉండి తమ వారిమీద కేసులు పెడితే.. ‘తప్పుడు కేసులు, వేధింపులు’ అని సన్నాయి నొక్కులు నొక్కుతారు. కానీ.. జగన్మోహన్ రెడ్డి.. పులివెందులలో తనను కలిసిన కార్యకర్తను ఊరడించి, ధైర్యం చెప్పడానికి చాలా దూకుడుగా మాట్లాడారు.

ఇటీవల హత్య అనే సినిమా వచ్చింది. వివేకా హత్య ఆయన కూతురే చేయించినట్టుగా చాటిచెప్పడానికి తీసిన సినిమా అది. ఆ సినిమాలో తనను, తన తల్లిని అవమానిస్తూ సీన్లున్నాయని.. హత్యకేసు నిందితుడు సునీల్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సీన్ల క్లిప్పింగులను వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని కొందరిపై ఫిర్యాదు చేశాడు. వైసీపీ వారినుంచి తనకు ప్రాణహాని ఉన్నదని కూడా ఆందోళన వ్యక్తం చేశాడు. దీనిపై ‘వైఎస్ అవినాష్ అన్న యూత్’ అనే వాట్సప్ గ్రూపు అడ్మిన్ పవన్ కుమార్ ను పోలీసులు పిలిచి విచారించి పంపారు. సదరు పవన్ కుమార్ పులివెందుల పర్యటనలో ఉన్న జగన్ ను కలిసి, డీఎస్పీ, సీఐ తనను కొట్టారని ఫిర్యాదు చేశాడు. దానికి జవాబుగా జగన్.. ‘మూడేళ్ల తర్వాత అదే డీఎస్పీతో నీకు సెల్యూట్ కొట్టిస్తా’ అంటూ ఊరడించడం చూసి చుట్టూ ఉన్న జనం కూడా నివ్వెరపోయారు.
జగన్మోహన్ రెడ్డి పోలీసులను తన ఇంటి పాలేర్లుగా, కట్టుబానిసలుగా భావిస్తున్నట్టున్నదని పలువురు విమర్శిస్తున్నారు. ఇలాంటి దుర్మార్గమైన బుద్ధులు ఆయనను ఎప్పటికీ ఒక మంచి రాజకీయ నాయకుడిగా ప్రజల ముందు నిరూపించలేవని, అదృష్టం కొద్దీ ఒకసారి సీఎం అవకాశం వచ్చి ఉండొచ్చు గానీ.. ఇలాంటి మాటలు చూస్తే ప్రజలు కూడా భయపడి అలాంటి నేతను శాశ్వతంగా దూరం పెడతారని విశ్లేషకులు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories