సరస్వతి పవర్ ఆస్తులు షేర్ల బదిలీ విషయంలో జగన్మోహన్ రెడ్డి కన్న తల్లి మీదనే కోర్టుకెక్కి నానా రాద్ధాంతం చేస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో, ఆయన జమానా సాగిన కాలంలో.. ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరిపేరిట ఆస్తులు ఏర్పడినా అవన్నీ ఉమ్మడిగా కుటుంబ ఆస్తులే అనేది అందరూ ఎరిగిన సంగతి. వైఎస్ విజయమ్మ కూడా ఈ విషయాన్ని పదేపదే ధ్రువీకరించారు. అయితే తన పేరిట ఉన్నవన్నీ తన ఆస్తులే అన్నట్టుగా ప్రవర్తించే జగన్మోహన్ రెడ్డి.. కుటుంబం మధ్య సుదీర్ఘకాల పంచాయతీల తరువాత సరస్వతి పవర్ పేరిట ఉన్న ఆస్తులను తల్లి వైఎస్ విజయమ్మకు గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చారు. తీరా విజయమ్మ జగన్ కనుసన్నల్లో, ఆయన చేతి కీలుబొమ్మలా నడవడం మానేసి స్వతంత్రంగా వ్యవహరిస్తున్న తరుణంలో.. అప్పుడు గిఫ్టుగా ఇచ్చిన షేర్లన్నీ తనకు వెనక్కు కావాలంటూ ట్రిబ్యునల్ లో దావా నడుపుతున్నారు. ఒకవైపు జగన్ తల్లిని కూడా వంచించాడని చెల్లెలు షర్మిల ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ట్రిబ్యునల్ ఎదుట జగన్ తరఫు న్యాయవాదులు వినిపిస్తున్న వాదనలను గమనిస్తే.. తల్లి వైఎస్ విజయమ్మను మోసం చేయాలని జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ డీడ్ రాసిచ్చిన రోజునుంచే ప్రణాళికాబద్ధంగా ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఎలాగంటే..
జగన్మోహన్ రెడ్డి- తన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల పేరుతో ఇచ్చిన గిఫ్ట్ డీడ్ పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదని ఆయన న్యాయవాది చెబుతున్నారు. వాటాల సర్టిఫికెట్లు, బదలాయింపు ఫారాలు ఇంకా జగన్ వద్దనే ఉన్నాయని అంటున్నారు. కాబట్టి గిఫ్ట్ డీడ్ అమల్లోకి రానట్టుగా పరిగణించాలని, సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ రిజిస్టరులో వాటాదార్ల పేర్లను సవరించి జగన్, ఆయన భార్య భారతి మరియు క్లాసిక్ రియాల్టీల తరఫున ఆయన వాదనలు వినిపించారు.
అంటే ఏమిటన్నమాట? జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఆస్తుల పంచాయతీ తలెత్తినప్పుడు.. తల్లి పేరుతో గిఫ్ట్ డీడ్ రాసి, కంటితుడుపుగా ఆమె చేతిలో పెట్టి పంపేశారు. అంతే తప్ప.. వాస్తవంగా గిఫ్ట్ డీడ్ కు కీలకంగా అవసరమని ఆయన భావిస్తున్న వాటాల సర్టిఫికెట్లు గానీ, బదలాయింపు ఫారాలు గానీ ఆమెకు ఇవ్వలేదు. అంటే ఏదో ఒకనాటికి ఆ పత్రాలు లేవు గనుక.. గిఫ్ట్ డీడ్ చెల్లదంటూ పిటిషన్ వేయవచ్చుననే దురాలోచన ఆయనకు ముందుగానే ఉన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు.
ఇప్పుడు జగన్ చెబుతున్న వాదన ఏంటంటే.. తల్లికి తన మీద ప్రేమ ఉన్నప్పుడు గిఫ్టు ఇచ్చా.. ఇప్పుడు ప్రేమ లేదు గనుక.. అది వెనక్కు ఇవ్వాలి.. అంటున్నారు. నిజానికి ఆయన ఈ ప్రేమ లేదనే వాదనను ఏదో ఒకనాటికి తెరమీదకు తెచ్చే ఉద్దేశంతోనే.. కేవలం తన సంతకాలతో డీడ్ మాత్రం ఇచ్చి.. వాటాల సర్టిఫికెట్లు ఇవ్వలేదని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అయితే.. ఆ గిఫ్ట్ డీడ్ ప్రామాణికమైనది కావడం వల్ల.. దానిద్వారా షేర్లు బదిలీ కావడంతో.. జగన్ ఖంగుతిని దావా నడుపుతున్నారని అంతా అనుకుంటున్నారు.