ఆయన మాట విని జగన్ తప్పు చేశారా?

జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలు చాలా సందర్భాల్లో సొంత పార్టీ వారికి కూడా అర్థం కావు. ఆయన ఒక పావును కదిపిన తర్వాత.. తదనుగుణంగా తామందరమూ నడుచుకోవాల్సిందే తప్ప, అలా చేయవద్దని ముందుగా సలహా ఇవ్వడానికి గానీ, దాన్ని దిద్దుకుందాం  అని తర్వాత సూచన చేయడానికి గానీ అవకాశం ఉండదని ఆ పార్టీ నాయకులు చెబుతుంటారు. ఆ క్రమంలో భాగంగానే.. ఒక నాయకుడి మాట విని జగన్ పార్టీకి నష్టదాయకమైన నిర్ణయాలు తీసుకున్నారనే అభిప్రాయాలు పార్టీ వారిలో వినిపిస్తున్నాయి. ఆ నాయకుడు మరెవ్వరో కాదు.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఆయన దెబ్బకు నెల్లూరులో పార్టీకి నష్టం జరుగుతున్నదనే అభిప్రాయం ఆ జిల్లా కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది.

జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల్ని బదిలీలు చేసే క్రమంలో నరసరావు పేట ఎంపీ కృష్ణదేవరాయల్ని గుంటూరుకు మార్చాలనుకున్నారు. గత అయిదేళ్లలో ఎంపీగా ఆయన నరసరావుపేట పరిధిలో చాలా కష్టపడిపనిచేశారు. ప్రజల్లో నేరుగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. తమాషా ఏంటంటే.. ఆ ఎంపీ నియోజకవర్గం పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా జగన్ ను కలిసి ప్రత్యేకంగా వేడుకున్నా కూడా కృష్ణ దేవరాయలుకు సీటు ఇవ్వడానికి జగన్ ఒప్పుకోలేదు. కృష్ణ దేవరాయలుకు ఉన్న మంచిపేరు కారణంగా, ఆయన అభ్యర్థి కాకపోతే.. తమ విజయావకాశాలపై ప్రభావం పడుతుందని వారు మొరపెట్టుకున్నా జగన్ వినలేదు. ఆయన పార్టీ వీడినా పర్లేదనుకుని బీసీ కార్డు వాడాలనే ఉద్దేశంతో నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను తెచ్చి అభ్యర్థిని చేశారు.

అనిల్ కుమార్ వలన.. అప్పటికే నెల్లూరులో పార్టీ గాడితప్పి ఉంది. ఆయన తనను బదిలీచేసేట్లయితే నెల్లూరు సిటీ సీటును తన అనుచరుడికే ఇవ్వాలని పట్టుబడితే జగన్ దానికి తలొగ్గారు. ఆయన కోసం ఒప్పుకున్నారు గానీ.. అదే నెల్లూరు ఎంపీ సీటు నుంచి  పోటీచేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి విజ్ఞప్తిని కన్సిడర్ చేయాలని అనుకోలేదు. వైఎస్సార్ కాలంనుంచి పార్టీకి ఎంతో అండదండగా ఉన్న, ఆర్థికంగా కూడా చేయూతగా ఉన్న వేమిరెడ్డి మాటను ఖాతరు చేయకపోవడం ఆయన ఈగోను దెబ్బతీసింది. ఆయన తెలుగదేశంలో చేరి ఆ పార్టీ తరఫున పోటీచేస్తున్నారు.

కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎప్పటినుంచో అనేకానేక సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చిన, ప్రజలందరిలో మంచి పేరు ఉన్న వేమిరెడ్డిని అనిల్ కోసం నిర్లక్ష్యం చేయడం జగన్ యొక్క అతిపెద్ద తప్పు అంటున్నారు లోకల్ జనం. ఇప్పుడు వేమిరెడ్డి బలం కూడా  తోడవడంతో నెల్లూరు సిటీ సీటునుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం నారాయణ గెలవబోతున్నారని అంటున్నారు. ఇలాంటి దుడుకు నిర్ణయాలకు జగన్ ఇంకా ఎన్నెన్ని నియోజకవర్గాల్లో మూల్యం చెల్లించాల్సి వస్తుందో వేచిచూడాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories