చాలా చిత్రమైన పరిస్థితి ఇది. ప్రతిపక్ష నాయకుడి హోదా కోరుకుంటున్న ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, మొన్నటిదాకా తనను ముఖ్యమంత్రి గా కుర్చీలో కూర్చోబెట్టిన జనం.. వరదల్లో నానా పాట్లు పడుతోంటే.. వారిని ఆదుకోవడానికి ఎంతో కొంత సాయం అందించారా? లేదా? అందించినట్టుగా ఒక మాట ప్రకటించి..తమ కరపత్రాల్లో, మీడియాల్లో ప్రకటించేసుకుని.. ఆ తర్వాత ఎగ్గొట్టారా? వరద బాధితులకు సాయం అందించే విషయంలో కూడా జగన్ దళాలు కక్కుర్తి వేషాలు వేస్తున్నాయా. డబ్బు ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా కీర్తి గడించాలని వారు ఆరాటపడుతున్నారా? లాంటి రకరకాల సందేహాలు ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్నాయి. ఇంతకూ జగన్ విరాళం ఇచ్చినట్టా ఇవ్వనట్టా అని అంతా అడుగుతున్నారు.
విజయవాడ వరద ముప్పులో ఏ రీతిగా మునిగిపోయిందో అందరికీ తెలుసు. కాస్త మంచి మనసున్న ప్రతి ఒక్కరూ కూడా ఉదారంగా విరాళాలతో ముందుకు వస్తున్నారు. సెలబ్రిటీలు చాలా పెద్ద సంఖ్యలో ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు చేరవేస్తున్నారు. ఏపీ మాత్రమే కాకుండా, తెలంగాణ కూడా తీవ్రంగా వరదల్లో ఇబ్బంది పడిన నేపథ్యంలో.. చాలా మంది సెలబ్రిటీలు రెండు తెలుగు రాష్ట్రాలకు సమానంగా సాయం అందిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి తీరు మాత్రం సెపరేటుగా ఉంది. ఆయన తెలంగాణను పూర్తిగా పక్కన పెట్టేశారు. పట్టించుకోలేదు. తాను మళ్లీ సీఎం కావడానికి ఎవరైతే ఓట్లు వేయాలో, వారు మాత్రమే తనకు ముఖ్యం అని నిరూపించుకున్నారు. ఏపీ వరద సాయానికి మాత్రం రూ.కోటి ప్రకటించారు. అయితే ప్రకటించన కోటి ఏమైందనే సంగతి మాత్రం ఎవ్వరికీ అర్థం కావడం లేదు.
జగన్ ప్రకటించిన విరాళం ఆయన సొంత సొమ్ము కాదు. ఆయన పరోక్ష యజమానిగా ఉండే మీడియా సంస్థలు లేదా వ్యాపార సంస్థలనుంచి కూడా కాదు. కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన కోటి విరాళం ప్రకటించారు. ప్రకటనే తప్ప ఆ డబ్బు ఎక్కడకు వచ్చిందో ప్రజలకు తెలియదు. ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వలేదు. ఆ డబ్బుతో ఫలానా పనిచేస్తున్నట్టుగా చెప్పలేదు. కాకపోతే జగన్ ప్రకటన చేసిన తర్వాత.. ఒకటిరెండు రోజులు విజయవాడలో కొందరు వైసీపీ నాయకులు వరద ప్రాంతాల్లో అన్నం పొట్లాలు, నీళ్ల సీసాలు పంచడం మాత్రం జరిగింది. ఆ తర్వాత వారు కూడా అదృశ్యం అయిపోయారు. జగన్ ప్రకటించిన కోటి సాయం అదేనా? అనం జనం విస్తుపోతున్నారు.
ఇంతకూ స్థానిక నేతలు పంచిన పొట్లాలకు జగన్ పార్టీనుంచి కోటి నిధులు వచ్చాయా? లేదా, లోకల్ లీడర్లను కార్యక్రమం చేయమని పురమాయించి.. వారు పంచిన పొట్లాల ఖర్చును కోటివిరాలంగా పార్టీ పద్దుల్లో రాసుకున్నారా? వాళ్లకు కూడా ఎగవేశారా? అనేది చాలా మంది సందేహం. వరద బాధితులను ఆదుకునే విషయంలో జగన్ చాలా సంకుచితంగా వ్యవహరించారనే ప్రజలు అనుకుంటున్నారు.