వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల పరిపాలన కాలంలో ‘ఉపముఖ్యమంత్రులు’ అనే విజిటింగ్ కార్డు కొట్టించుకుని.. బేలగా తిరిగిన నాయకులకు ఎన్నడైనా కాస్తంత విలువ దక్కిందా? అలాంటి సందర్భాలు మీకు గుర్తున్నాయా? పేరుకు డిప్యూటీ ముఖ్యమంత్రినే గాని ఒక ఎమ్మెల్యే కు ఉండే పార్టీ విలువ కూడా తనకు ఉండడం లేదని, తన సొంత నియోజకవర్గంలో అధికారులు కూడా స్థానిక రెడ్డి నాయకుల మాటలు పాటిస్తున్నారే తప్ప, తన ఆదేశాలకు విలువ ఇవ్వడం లేదని అప్పటి డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామి మీడియా ముందు బోరుమన్న వైనం కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రజాస్వామ్య రాజకీయాలలో పెత్తందారీ పోకడలకు నిలువెత్తు నిదర్శనం అయిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన- డిప్యూటీ ముఖ్యమంత్రి అనే పేరుతో నలుగురిని నియమించి వారిని తోలుబొమ్మల్లాగా ఆడించింది. అలాంటి దుర్మార్గ పాలకులకు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొంత స్వతంత్రంగా వ్యవహరించడం కంటగింపుగా ఉన్నట్లుంది. ఈ వైఖరిని వారు సహించలేకపోతున్నారు. అందుకే హోం శాఖకు సంబంధించిన విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుంటూ ఉండగా- వైసీపీ నాయకులు, వారి తైనాతీలు అయిన విలేకరులు నెత్తి నోరు బాదుకుంటున్నారు.
భీమవరం డీఎస్పీ అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా ఆరోపణలు తన దృష్టికి రావడం, సివిల్ మేటర్స్ సెటిల్మెంట్లలో జోరుగా ఉన్నాడని, దందాలు వసూలు చేస్తూ పేకాట క్లబ్బులను స్వయంగా ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆ జిల్లా ఎస్పీతో మాట్లాడారు. అలాగే.. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి అక్రమాలు ఎలా ఉన్నాయో, ఒకసారి గమనించి తనకు నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర డీజీపీని కూడా కోరారు. అక్కడికేదో పవన్ కల్యాణ్ ఘోరమో నేరమో చేసేసినట్టుగా యాగీ చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, వాళ్ల నీలిమీడియా విలేకర్లు తాపత్రయపడుతున్నారు. హోంమంత్రి అనితను ప్రశ్నలు అడుగుతున్నారు.
అయితే తమ పాలన కాలంలో డిప్యూటీ ముఖ్యమంత్రుల్ని పప్పెట్ లుగా చేసి ఆడించిన జగన్ దళాలకు వారి విలువ తెలుస్తుందా? అని ప్రజలు అంటున్నారు. నిజానికి పవన్ కల్యాణ్ చేసిన తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ కాదు కదా.. ఒక సాధారణ పౌరుడు కూడా డీఎస్పీ దందాల గురించి ఎస్పీకి చెప్పవచ్చు కదా అని అంటున్నారు. ఒక సాధారణ పత్రికా విలేకరి డీజీపీని రాష్ట్రంలో ఇలాంటి వ్యవహారాలపై ఏం చర్యలు తీసుకుంటున్నారని అడగడం సాధ్యమే కదా.. మరి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి అదే విషయాన్ని డీజీపీని అడిగితే.. ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.