పవన్ కల్యాణ్ తరఫున జనసేన దళంలోని 21 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు మంత్రిపదవులు పొందబోతున్నారు. మరి పవన్ కల్యాణ్ సంగతి ఏమిటి? ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని స్వీకరించడం గురించి కోరిక ఉన్నదని ఇండియా టుడే ఛానెల్, ఆయనతో స్వల్ప సంభాషణ అనంతరం ప్రకటించింది. అయితే.. హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలు చూడాలనే కోరిక పవన్ కల్యాణ్ లో ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఈ రెండు అంశాలను సమన్వయం చేసి చూసుకుంటే.. పవన్ కల్యాణ్ హోంశాఖను తీసుకుని, డిప్యూటీ ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతారని అర్థమవుతోంది.
పవన్ కల్యాణ్ కు హోం శాఖ అంటే చాలా ఆసక్తి ఉంది. ఒక ఎక్సయిజ్ కానిస్టేబుల్ కొడుకుగా పుట్టి పెరిగిన ఆయనకు.. హోంశాఖ మంత్రి కావాలనేది ఒక ముచ్చట. తనకు పోలీసులు అంటే ఎంతో గౌరవం అని తన తండ్రి కూడా ఒక పోలీసు అని పవన్ కల్యాణ్ చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటారు. పోలీసులను ఆయన దూషించరు. ఇన్నాళ్లలో కూడా ఆయన పోలీసులను నిందించిన సందర్భాలు చాలా తక్కువ. పైగా.. పోలీసులను లోబరచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా దందాలు నడిపిస్తున్నారంటూ పార్టీ మీద మాత్రమే విమర్శలు చేశారు.
అందుకోసమే ఆయన పోలీసుల మీద అత్యున్నత అధికారం ఉండే హోంమంత్రిత్వ శాఖను కోరుకుంటున్నట్టు సమాచారం. అయిదే సాధారణంగా హోం మంత్రిగా ఎవరున్నప్పటికీ.. శాంతిభద్రతలు మాత్రం సీఎం తన చేతిలో పెట్టుకుంటారు. ఇది దశాబ్దాలుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా అలవాటుగా జరుగుతున్న సంగతి. పవన్ కల్యాణ్ శాంతిభద్రతలతో కూడిన హోంశాఖను డిమాండ్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇదే జరిగితే.. పవన్ కల్యాణ్ ఇంచుమించుగా హోం విషయంలో ముఖ్యమంత్రి స్థాయి అధికారాలను కలిగిఉన్నట్టే అవుతుంది.
పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి కావడం ద్వారా తన ముచ్చట తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరి.. ఆ శాఖలో ఆయన తన ముద్ర ఎలా చూపిస్తారో వేచిచూడాలి.