వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడిప్పుడే కాస్త ధైర్యం చిక్కబరచుకుంటున్నారా? ఎన్నికల్లో పార్టీ దారుణ పరాజయం గురించి తమ ఒరిజినల్ అభిప్రాయాలను ఇన్నాళ్లూ ప్రెవేటు సంభాషణల్లో మాత్రమే మాట్లాడుకుంటూ వచ్చిన వైసీపీ నేతలు ఇప్పుడు బహిరంగంగానే మాట్లాడడానికి సిద్ధమవుతున్నారా? ఎవరో ఒకరు ఓపెన్ గా నోరు విప్పితే తప్ప.. పార్టీ లోపాలను సరిదిద్దుకోవడం కష్టమని, మళ్లీ నిలదొక్కుకోవడం కష్టమని అనుకుంటున్నారా? అనిపిస్తోంది. తమ పార్టీలోని కొందరు నాయకుల నోటి దురుసు కారణంగానే.. వైసీపీ ఓడిపోయిందని వైసీపీ విశాఖ సౌత్ పార్టీ ఇన్చార్జి వాసుపల్లి గణేశ్ అంటున్నారు. ఆయన ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
‘వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఆర్‌కే రోజా వంటి నాయకులు పలు సందర్భాల్లో నీచంగా మాట్లాడడం పార్టీకి తీవ్ర నష్టం కలిగించింది. వారి వల్లే పార్టీ ఓటమి చెందింది. ఇష్టారాజ్యంగా మాట్లాడితే ప్రజలు క్షమించరు’ అంటూ వాసుపల్లి గణేశ్ ఇంటర్వ్యూలో చెప్పారు.
‘నోరుంది కదా అని మహిళలను కించపరచడం, ఏకవచనంలో మాట్లాడడం, ప్రతిపక్ష నేతలను ఏదిపడితే అది అంటే ఆ వర్గ ప్రజలు క్షోభకు గురవుతారు. ఎన్నికల సమయంలో వారి కోపాన్ని ఓట్లరూపంలో చూపిస్తారు. అధికారంలో ఉన్నాం అని ఏది పడితే అది మాట్లాడితే సమాజం సహించదు. ఎవరికి వారు లక్ష్మణ రేఖలు గీసుకోవాలి.. వల్లభనేని వంశీ లీడర్ అని నేను అనుకోను. వంశీ, కొడాలి నాని ల వయసేంటి వారు మాట్లాడిన మాటలేంటి? అసభ్యంగా మాట్లాడిన వీరంతా పార్టీని సర్వనాశనం చేసేశారు. ఇలాంటి వారంతా పార్టీనుంచి వెళ్లిపోవాలి. ఇలాంటి వారు ఇంకా కొంత మంది ఉన్నారు..’ అంటే వాసుపల్లి గణేశ్ అంటున్నారు.
నిజానికి వైసీపీలోని దుర్మార్గ నాయకుల గురించి ఇలాంటి అభిప్రాయం ఆ పార్టీలోనే పలువురునేతలకు ఎన్నికలకు ముందునుంచీ ఉంది. కాకపోతే.. జగన్మోహన్ రెడ్డి యొక్క పెత్తందారీ ఏకపక్ష పోకడలకు భయపడి వారు ఎన్నడూ అధినేత దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించలేదు. జగన్ కు చెప్పినా ప్రయోజనం లేదనే సంగతి వారికి తెలుసు. ఆరోజున తామంతా సైలెంట్ గా ఉండడం వల్లనే పార్టీ దెబ్బతినిపోయిందని ఇప్పుడు బాధపడుతున్నారు.
2019 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున గెలిచిన వాసుపల్లి గణేశ్ ఆ తర్వాతి పరిణామాల్లో వైసీపీ పంచన చేరారు. 2024 లో వైసీపీ తరఫున పొటీచేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఆయనలో రియలైజేషన్ వచ్చినట్టుంది. పార్టీ నాయకులందరూ ఓటమి కారణాల గురించి మేలుకుని వాస్తవాలు గ్రహిస్తున్నారు గానీ.. ఈ మాత్రం అవగాహన జగన్మోహన్ రెడ్డిలో వచ్చిందా లేదా అనేది మాత్రం ప్రశ్నార్థకమే.