ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి భారీ మెజారిటీ సాధించి సుమారు 164 స్థానాలు దక్కించుకున్న సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంగళవారం మధ్యాహ్నం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయస్థాయిలో సైతం ఇదే అంశం మీద చర్చ జరుగుతోంది. అయితే ఆసక్తికరంగా చంద్రబాబు సహా నారా లోకేష్, బాలకృష్ణ, పురందేశ్వరి, భరత్ కి శుభాకాంక్షలు చెబుతూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఇంతటి ఘన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీకు ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్, మూడోసారి విజయం అందుకున్న బాలకృష్ణ బాబాయ్ కి, ఎంపీలుగా గెలిచిన శ్రీ భరత్, పురందేశ్వరి అత్తకి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.
అలాగే ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. నిజానికి గత కొంతకాలంగా తెలుగుదేశానికి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య దూరం పెరుగుతుందని ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి. దానికి తోడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్నికల ముంగిట ఎలాంటి ప్రచారంలో పాల్గొనకపోవడం, సపోర్ట్ ఇస్తూ ట్వీట్ కూడా చేయకపోవడంతో టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందని అందరూ భావించారు.
అయితే చంద్రబాబు సహా గెలిచిన తన కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు చెబుతూ జూనియర్ ఎన్టీఆర్ ట్విట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది.