వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐ విచారిస్తోంది. ఈ విషయంలో కొందరు బెయిల్ మీద బయట ఉన్నారు. కొందరు బెయిలు కావాలని కోరుతూ జైళ్లలోనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లోపలా బయటా జరుగుతున్న అనేక పరిణామాల మీద ఇప్పుడు నేరుగా రాష్ట్రప్రభుత్వమే దర్యాప్తు చేసే వాతావరణం కనిపిస్తోంది. కేసును సీబీఐ విచారిస్తున్నదనే సాకుతో.. రాష్ట్ర పోలీసుల వద్ద నమోదైన అనేక కేసుల గురించి జగన్మోహన్ ఱెడ్డి పాలన కాలంలో అసలు పట్టించుకోకుండా వదిలేశారు. అలాంటి కేసులన్నింటినీ ఇప్పుడు రాష్ట్ర పోలీసులు తిరగతోడే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే.. వివేకా హత్య కేసును పక్కదారి పట్టించడానికి ప్రధాన నిందితుల పాత్రను మసిపూసి మారేడు కాయ చేయడానికి జరిగిన ఇతర ప్రయత్నాల గురించి రాష్ట్రపోలీసులే విచారిస్తారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమి ప్రభుత్వం పాలన కావడంతో.. ఈ దిశగా విచారణ సాగితే.. పలువురు వైసీపీ పెద్దలకు డేంజర్ బెల్స్ మోగుతున్నట్టే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రధానంగా.. వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి చుట్టూ వ్యవహారం నడవబోతోంది. దస్తగిరిని గత ఏడాది అక్టోబరు 31న ఒక అట్రాసిటీ కేసులో పోలీసులు అరెస్టు చేసి కడప సెంట్రల్ జైలుకు పంపారు. హైకోర్టు బెయిలు ఇచ్చినా కూడా వేముల పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. దస్తగిరి జైల్లో ఉండగా.. ఖైదీలకు మెడికల్ క్యాంపు జరిగింది. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు, జైల్లో ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డి ఈ క్యాంపు నిర్వహించారు. క్యాంపు పేరుతో బ్యారక్స్ వద్దకు వచ్చా.. దస్తగిరిని కలిసి ప్రలోభ పెట్టినట్టు బెదిరించినట్టు దస్తగిరి తర్వాత ఆరోపించారు. తనను బలవంతంగా అప్రూవర్ గా మార్చినట్టు, సీబీఐ అధికారి రాంసింగ్ తననను కొట్టి ఆమేర ఒప్పించినట్టుచెబితే 20 కోట్లు ఇస్తాం అని చైతన్యరెడ్డి ఆఫర్ చేసినట్టు సమాచారం. ఒప్పుకోకపోవడంతో జైలు కాబట్టి బతికిపోయావ్.. లేకుంటే నరికేసేవాడినంటూ చైతన్యరెడ్డి బెదిరించినట్టు కూడా దస్తగిరి ఆ తర్వాత ఎస్పీకి, సీబీఐ వారికి దస్తగిరి ఫిర్యాదు చేశాడు.
ఆ ఫిర్యాదుల్ని అప్పట్లో జగన్ పాలన గనుక రాష్ట్ర పోలీసులు సహజంగానే పట్టించుకోలేదు. ఇప్పుడు పోలీసులు వాటిని తిరగతోడబోతున్నారు. దీంతో చైతన్యరెడ్డి పాత్ర బయటకు వస్తుంది. ఆయన తండ్రి శివశంకర్ రెడ్డి కోసమే చేశారా? ఇంకా తెరవెనుక ఎవరైనా ఉన్నారా? అనేది కూడా తెలుస్తుంది. మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డి బెయిలు రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టులో పిటిషన్ నడుపుతున్నారు. తమపై అక్రమ కేసులు పెట్టించారని కూడా సుప్రీంకు నివేదించారు. సుప్రీం రాష్ట్రప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చింది. దాంతో రాష్ట్ర పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు సాగించే అవకాశం ఉంది.
మొత్తానికి వివేకా హత్య కేసులో రాష్ట్ర పోలీసు యంత్రాంగం సమాంతరంగా ఇతర కేసులపై విచారణ సాగించినా కూడా.. ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బలంగా బిగుసుకుంటుందని అంచనాలు సాగుతున్నాయి.