దర్శనం టికెట్ల దందాలు : వర్లకు తెలిసింది తక్కువే!

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రతి రంగంలోనూ కూడా లెక్కలేనన్ని అరాచకాలు చోటుచేసుకున్నాయి. ఆ సంగతి ప్రజలందరూ కూడా గుర్తించారు గనుకనే.. ఆ ప్రభుత్వాన్ని దారుణంగా ఓడించి ఇంటికి పరిమితం చేశారు. జగన్ జమానాలో ప్రత్యేకించి తిరుమల వేంకటేశ్వర స్వామివారికి జరిగిన ద్రోహాలు కూడా అనేకం. ఇప్పుడు లడ్డూ ప్రసాదానికి వాడిన నెయ్యి వ్యవహారం రగడ అవుతోంది. అదే సమయంలో.. తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య.. దర్శనం టికెట్ల గోల్ మాల్ విషయంలో జరిగిన దందాను కూడా తెరపైకి తెస్తున్నారు. అయితే ఆయన చెబుతున్న వివరాలు గమనిస్తే ఆయనకు తెలిసింది చాలా తక్కువే అని అనిపిస్తోంది.

ప్రతిరోజూ పర్యాటక శాఖకు వెయ్యి దర్శనం టికెట్లు కేటాయిస్తారని.. వాటిని బ్లాకులో అమ్ముకోవడం ద్వారా అక్రమాలకు తెరలేపేవారనేది ఆయన ఆరోపణ. మంత్రిగా రోజా ఇబ్బడిముబ్బడిగా టార్గెట్లు పెట్టి లక్షలు దండుకున్నారని కూడా ఆరోపిస్తున్నారు. అయితే వర్ల రామయ్య ప్రస్తావిస్తున్న దానికంటె ఎక్కువగానే టికెట్ల దందాలు జరిగేవని, అక్రమార్కులు సొమ్ము కాజేసేవారని ప్రజలు , భక్తులు అంటున్నారు.

రోజా విషయానికి వస్తే.. నిజానికి ఆమె మంత్రి అయిన తర్వాత దర్శనాల్లో డబ్బు దండుకోవడం మాత్రమే కాదు. ఎమ్మెల్యేగా ఉండగా కూడా ప్రతినెలా కొన్ని లక్షలరూపాయలు వక్రమార్గాల్లో దండుకునే వారని ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేలకు (పైగా లోకల్ ఎమ్మెల్యే) నెలకు ఓసారి ప్రోటోకాల్ దర్శనం ఉంటుంది. వారు ఇచ్చే సిఫారసు లేఖలకు అదనంగా, ఆ ఒక్క సందర్భంలో ఎమ్మెల్యే వెంట వచ్చే భక్తులను పెద్దసంఖ్యలో అనుమతించేవారు. పైగా ప్రోటోకాల్ దర్శనం! బ్లాక్ మార్కెట్ లో దీని ధర ఒక్కొక్కటి 20 వేల వరకు కూడా పలుకుతుంటుంది. ఈ టికెట్లను తాను ఏర్పాటుచేసుకున్న సొంత దళారీ ఉద్యోగుల ద్వారా రోజా బేరాలపై విక్రయించి దండుకునేవారని ఆరోపణలున్నాయి. మంత్రి అయ్యాక ఇక చెప్పేదేముంటుంది.

వర్ల చెబుతున్న ప్రకారం.. పర్యాటక శాఖకు ఇచ్చే వెయ్యి టికెట్లలో సుమారు 800 టికెట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు ఉన్న కళాధర్ ట్రావెల్స్ కే ఇచ్చేవారని అంటున్నారు. ఒక్క ట్రావెల్స్ వారికే అన్ని టికెట్లు ఇవ్వడం ఏమిటి? అని వర్ల ప్రశ్నిస్తున్నారు.

వర్ల చెప్పని విషయాలు ఇంకా అనేకం ఉన్నాయి. కరుణాకరరెడ్డి జమానా మొదలయ్యాక తిరుపతిలోని ఆయన అనుచరగణం ఇబ్బడి ముబ్బడిగా రూ.300 దర్శనం టికెట్లను కూడా బ్లాకులో అమ్ముకునే దందాలను విచ్చలవిడిగా సాగిస్తూ వచ్చారు. వీటన్నింటిపై చంద్రబాబు సర్కారు గట్టిగా విచారణ జరిపిస్తే బాగుంటుందని పలువురు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories