తాను మానవాతీతుడినని, చట్టానికి కూడా అతీతుడనని, తనకు కొమ్ములు వచ్చాయని విర్రవీగే అలవాటున్న వ్యక్తి రాంగోపాల్ వర్మ! అందుకే ఎక్స్ ఖాతాలో వెకిలిపోస్టులు పెట్టినందుకు పోలీసులు నోటీసులు ఇస్తే.. వాటిపట్ల అతిశయంగా స్పందించారు. మామూలుగా తన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న సమయాల్లో సంచలన వ్యాఖ్యలు చేయడం, సంచలనాలకు కేంద్రబిందువుగా మారడం.. తద్వారా సినిమాకు అంతో ఇంతో మార్కెట్ క్రియేట్ చేసుకోవడం రాంగోపాల్ వర్మకు అలవాటు. అలాంటిది.. ఇప్పుడు ఆయన భ్రమలు వీడి.. తాను కూడా మామూలు వ్యక్తినేనని, ఈ దేశంలో చట్టానికి లోబడి ఉండాల్సిందేనని సత్యాన్ని గ్రహించినట్టుగా ఉన్నారు. అందుకే ఒంగోలు రూరల్ పోలీసుల ఎదుట ఫిబ్రవరి 7న విచారణకు హాజరు కావడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. పోలీసులు తనను విచారణకు పిలవడాన్నే పెద్ద నేరంలాగా చిత్రీకరిస్తూ, రకరకాల లాజిక్కులు మాట్లాడుతూ టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చిన రాంగోపాల్ వర్మ కొమ్ములను, ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మొత్తానికి వంగదీశారు.
వ్యూహం సినిమా విడుదల సమయంలో రాంగోపాల్ వర్మ చాలా అతి చేశారు. అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్యాకేజీ మాట్లాడుకుని.. ఆయన ఇచ్చిన డబ్బుకోసం జగన్ ను మహానుభావుడిగా ప్రొజెక్టు చేయడానికి ఆయన వ్యూహం సినిమా తీశారు. నిజానికి అలాంటి చవకబారు సినిమాను ఆయన శివ కంటె, సర్కార్ కంటె అత్యద్భుతంగా చిత్రీకరించి ఉన్నప్పటికీ కూడా దానిని జగన్ భజనపరులు, చంద్రబాబును ద్వేషించేవాళ్లు తప్ప మరొకరుచూసే అవకాశం లేదు. అలాంటి థర్డ్ రేట్ సినిమాకు మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి రాంగోపాల్ వర్మ.. తన ఎక్స్ ఖాతాలో అనుచితమైన మార్ఫిగ్ ఫోటోలు పెడుతూ అతిగా వ్యవహరించారు.
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అప్పటి పోస్టులే ఆయన మెడకు చుట్టుకున్నాయి. ఆ పోస్టుల గురించి రాష్ట్రంలో అనేక చోట్ల కేసులు నమోదు అయ్యాయి. ఈ అన్ని కేసులకు సంబంధించి.. ఒంగోలు రూరల్ పోలీసులు మాత్రం ఆయన హైదరాబాదు కార్యాలయానికి వెళ్లి.. విచారణకు రావాల్సిందిగా వర్మకు నోటీసులు అందజేశారు. విచారణకు రాకుండా రెండుసార్లు వర్మ డుమ్మా కొట్టారు. మధ్యలో కోర్టుకు వెళ్లారు. కావలిస్తే వీడియోకాల్ లో విచారించుకోవచ్చునని.. మడతపేచీలు పెట్టారు. అవన్నీ వర్కవుట్ కాలేదు. ఆయనకు బెయిలు ఇచ్చిన సందర్భంలోనే దర్యాప్తుకు సహకరించాలని, వ్యక్తిగతంగా హాజరై, పత్రాలు సమర్పించి బెయిలు పొందాలని హైకోర్టు వర్మకు సూచించింది. దీంతో ఫిబ్రవరి 4న విచారణకు రావాలంటూ ఎస్పీ ఏఆర్ దామోదర్ వర్మకు నోటీసులు పంపారు. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో రాలేనని, 2,3,6,7 తేదీల్లో రాగలనని వర్మ జవాబివ్వడంతో .. మొత్తానికి 7వ తేదీన ఒంగోలు విచారణకు హాజరయ్యేందుకు వర్మ రానున్నట్లు తెలిసింది.
పోలీసు స్టేషను దాకా వెళ్లకుండానే.. రకరకాల గిమ్మిక్కులతో ఈ గండం దాటాలని శతవిధాల ప్రయత్నించి రాంగోపాల్ వర్మ అహంకారాన్ని, ప్రకాశం ఎస్పీ దామోదర్ అణచినట్లయింది.