చిన్ని అంటూ వచ్చేసిన డాకు మహారాజ్‌!

నందమూరి నట సింహం బాలయ్య బాబు నటిస్తున్న తాజా సినిమా డాకు మహారాజ్‌ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాకి యంగ్‌ అండ్ టాలెంటెడ్‌ డైరెక్టర్‌  బాబీ కొల్లి డైరెక్షన్‌ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తున్న ‘డాకు మహారాజ్’పై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి.

. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టైటిల్ టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి, ఇటీవల విడుదలైన మొదటి గీతం ‘ది రేజ్ ఆఫ్ డాకు’కి అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండవ గీతం చిన్ని విడుదలైంది. బాలకృష్ణ, తమన్ కలయిక అంటే పాటలపై సంగీత ప్రియుల్లో అంచనాలు ఉండటం సాధారణమే. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ‘డాకు మహారాజ్’కి తమన్ అద్భుతమైన సంగీతం అందించినట్లు తెలిసిపోతుంది.

ఇక ఇప్పుడు రెండో గీతంతో బాలకృష్ణ-తమన్ కలయిక ఎందుకంత ప్రత్యేకమైనదో మరోసారి తెలిసిపోయింది. చిన్ని పాటకు తమన్ అందించిన సంగీతం హృద్యంగా ఉంది. మనసుకి హత్తుకునే ఆ సంగీతానికి తగ్గట్టుగా అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం పాటకు మరింత వన్నెతీసుకొచ్చింది. ఆయన కలం నుంచి జాలువారిన “నువ్వు తే అంటే నీ ముందు తారా తీరాలే. నువ్వు నవ్వుతుంటే అమావాస్యయినా దీపావళిగా మారాలే.” వంటి సున్నితమైన, సుమధురమైన పంక్తులు కట్టి పడేస్తున్నాయి. తన మధుర గాత్రంతో గాయకుడు విశాల్ మిశ్రా పాటను మరో స్థాయిలో ఉంచారు..

లిరికల్ వీడియోని గమనిస్తే అద్భుతమైన విజువల్స్, విశ్వ రఘు ఆకట్టుకునే కొరియోగ్రఫీ చిన్ని పాటకుమరింత జీవాన్ని పోశాయి. బాలకృష్ణ, చిన్నారి మధ్య భావోద్వేగ,  ఉల్లాసభరితమైన బంధాన్ని ఆవిష్కరిస్తూ ఊటీ నేపథ్యంలో ఈ పాటను ఎంతో అందంగా తీర్చిదిద్దారు. పాప క్షేమం, సంతోషం కోరే రక్షకుడిగా బాలకృష్ణ ఈ ‘చిన్ని’ గీతంలో కనపడుతున్నారు.

అలాగే లిరికల్ వీడియోలో చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా ప్రత్యేక ఆకర్షణగా కనపడుతున్నారు. ‘చిన్ని’ అనే ఈ మధుర గీతం బాలకృష్ణపై కుటుంబ ప్రేక్షకులకు, ఈ తరం పిల్లలకు ఉన్న అభిమానాన్ని మరింత పటిష్టం చేస్తుంది అనడంలో ఏ మాత్రం డౌట్‌ లేదు.

Related Posts

Comments

spot_img

Recent Stories