సంక్షేమ పథకాలు అంటే ప్రజల బాగు కోసం సంకల్పించినవిగా ఉండాలి. ఒకసారి అలాంటి పథకాలకు రూపకల్పన చేసిన తర్వాత వాటి సహజమైన పద్ధతిలో అవి కొనసాగుతూ పోవాలి. కానీ సంక్షేమ పథకాలు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఆకట్టుకోవడానికి విసిరే బిస్కెట్ల లాగా నిర్వచనాన్ని మార్చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి మాత్రమే చెల్లింది. బటన్ నొక్కడం కూడా పూర్తయి ఎంతో కాలం కింద ప్రజలకు విడుదల కావాల్సిన పథకాల నిధులను విడుదల చేయడంలో.. సరిగ్గా పోలింగ్ ముందు వరకు జాగు చేసి.. ఇప్పుడు విడుదల చేస్తానని పూనుకోవడం కుట్ర కాక మరేమిటి? అందుకే అలాంటి కుట్రలకు ఎన్నికల సంఘం తెరదించింది. పథకాలను జగన్ విసిరే బిస్కెట్లు లాగా మార్చేయాలనుకున్న కుట్రలకు చెక్ పెట్టింది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు అందించవలసిన పెట్టుబడి రాయితీ 847 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి మార్చి ఆరవ తేదీన బటన్ నొక్కారు. అలాగే విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 610 కోట్లు విడుదల చేయడానికి మార్చి 1న బటన్ నొక్కారు. మార్చి 16వ తేదీన ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఆ 10, 15 రోజులపాటు విధులు విడుదల చేయకుండా ఆపేశారు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా ఇప్పటిదాకా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఆ నిధులను విడుదల చేయడం గురించి పట్టించుకోలేదు. తీరా మరొక వారం రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనిగా ఇప్పుడు హడావుడి చేశారు. ఈ సమయంలో ప్రజల ఖాతాలలో డబ్బులు వేస్తే వారిని ఆకర్షించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయించుకోవడం సాధ్యమవుతుందని కుట్రపన్నారు. అయితే ఎన్నికల సంఘం ఈ నిధుల విడుదలకు అనుమతి ఇవ్వలేదు.
పైగా జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడిగా.. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వైఖరి ఈ వ్యవహారంతో వివాదాస్పదం అవుతుంది. జవహర్ రెడ్డి మీద కూడా వేటు వేసి ఎన్నికల విధులతో సంబంధం లేకుండా బదిలీ చేస్తే తప్ప రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికే పరిస్థితి లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.