పదేళ్ల తర్వాత మేనిఫెస్టోపై విమర్శలా?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న బస్సు యాత్ర ప్రసంగాల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. బిజెపిని పల్లెత్తు మాట అనలేని భయంతో కూడిన నిస్సహాయత ఆయనను వెనక్కు లాగుతోంది. ఎంత తిట్టినా చంద్రబాబును, పవన్ కల్యాణ్ ను మాత్రమే తిట్టాలి. అందుకు తగిన పాయింట్లు ఆయన వద్ద లేవు. తెలుగుదేశం ఇప్పటికే సూపర్ సిక్స్ అనే కీలకమైన హామీలతో పాటూ.. ప్రజలకు అనేకానేక కొత్త వరాలను ప్రకటిస్తోంది. వాటికి కౌంటర్ ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డికి భయం వేస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం విడుదల చేసిన మినీ మేనిఫెస్టో అంశాలను కనీసం చదవాలంటే కూడా జగన్ కు భయం. వాటికి కౌంటర్ ఇవ్వడం తనకు చేతకాదు.. అలాగని, వాటిని మించి అవే పథకాలను నేనే ఇస్తా అని చెప్పడానికి కూడా ధైర్యం లేదు. 2024 ఎన్నికల ప్రచారసభల్లో.. 2014 నాటి తెలుగుదేశం మేనిఫెస్టోలోని అంశాలను, అందులోని హామీలను ప్రస్తావిస్తూ నిందలు వేయడం అనేది.. జగన్ లోని బేలతనానికి నిదర్శనంగా నిలుస్తోంది.

పదేళ్ల కిందటి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ లాగా వ్యవహరిస్తున్నట్టుగా ఉన్నారు. ప్రతి సభలో అప్పటి పదేళ్ల పాతదైన తెలుగుదేశం  మేనిఫెస్టోను చూపిస్తూ.. అందులోని హామీలను చంద్రబాబునాయుడు మరచిపోయారని, తర్వాత పార్టీ వెబ్ సైట్ లోంచి కూడా దానిని తొలగించారని అంటున్నారు. నిజానికి అందులో చాలావరకు హామీలు తెలుగుదేశం నెరవేర్చినవే. మిగిలిపోయిన ఒకటిరెండు హామీలను మాత్రమే పదేపదే ప్రస్తావిస్తూ విమర్శిస్తున్నారు.

ఒకవేళ జగన్ చేస్తున్న ఆరోపణలన్నీ నిజమే అని కూడా అనుకుందాం. 2014 లో ఇచ్చిన హామీలు చంద్రబాబు నిలబెట్టుకోలేదనే అనుకుందాం. మరి అందుకే కదా.. ప్రజలు 2019లో ఓడించారు. ఇప్పుడు మళ్లీ అదే పాత మేనిఫెస్టోను పట్టుకుని చంద్రబాబును తిట్టిపోయడం వెనుక ఆంతర్యం ఏమిటి?

దానికి ఒక గట్టి కారణమే ఉంది. ఇప్పుడు చంద్రబాబునాయుడు ప్రకటించిన మేనిఫెస్టోలో తిట్టడానికి ఏమీ లేదు. దాదాపుగా ఏడాది కిందట చంద్రబాబు మినీ మేనిఫెస్టో ప్రకటించారు. సూపర్ సిక్స్ ఆయన వాగ్దానాలు బాగా చెలామణీలోకి వచ్చేశాయి. వాటిని ఎదుర్కోవడం ఎలాగో జగన్ కు బోధపడడం లేదు. అసహనానికి గురవుతున్నారు. అందుకే పాత మేనిఫెస్టో పట్టుకుని ఊరేగుతున్నారని అంతా అంటున్నారు. జగన్ కు నిజంగా చంద్రబాబు చిత్తశుద్ధిని విమర్శించే ఆలోచన ఉంటే.. ఇప్పుడు మేనిఫెస్టోలోని అంశాల గురించి మాట్లాడాలి.. అన ప్రజలు కోరుకుంటున్నారు. అవి ఆచరణ సాధ్యమో కాదో చెప్పాలని అంటున్నారు. జగన్ కు కేవలం అప్పులు తేవడం మాత్రమే తెలుసునని, చంద్రబాబునాయుడు అలా కాకుండా.. సంపదసృష్టి కూడా తెలిసిన నాయకుడు అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories