చేతగానితనానికి తోడు చంద్రబాబుపై విమర్శలా?

వాలంటీర్ల ద్వారా పింఛన్ల లబ్ధిదారులను మభ్యపెట్టి, ప్రలోభ పెట్టి, భయపెట్టి వారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించుకోవాలని జగన్ దళం ఆశించింది. అయితే సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదు పర్యవసానంగా.. మూడు నెలల పాటు వాలంటీర్లను పింఛన్ల పంపిణీ వ్యవహారానికి దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి నిజాయితీ ఉన్నట్లయితే గనుక.. ఈసీ ఆదేశాలు వచ్చిన తక్షణం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం గురించిన ఆలోచన సాగి ఉండాలి. అలాంటి ప్రయత్నం చేయకపోగా సచివాలయాల వద్దకు వచ్చి పింఛన్లు తీసుకువెళ్లాలంటూ ఒక చేత్తో ఉత్తర్వులు జారీ చేసేసి.. మరొక చేత్తో తమ పార్టీ కార్యకర్తలను ఎగదోలి వృద్ధులందరినీ రోడ్లమీదకు లాక్కొచ్చి వారి ప్రాణాలను బలిగొన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టుగా చంద్రబాబు నాయుడుని నిందించడానికి ప్రయత్నిస్తున్నది.

ఏప్రిల్ నెలలో 32 మంది వృద్ధుల ప్రాణాలను బలి తీసుకున్న ప్రభుత్వ వైఫల్యం.. నెల రోజుల వ్యవధిలో ఎలాంటి ప్లాన్ బి మార్గాన్ని కనిపెట్టలేకపోవడం చేతకానితనం కాక మరేమిటి? ఒకవైపు చంద్రబాబు నాయుడు- ఎంత మంది సచివాలయ ఉద్యోగులు అందుబాటులో ఉంటారో గణాంక వివరాలతో సహా పదేపదే మొత్తుకుంటూ ఉన్నారు. ఆయన ఒకవైపు ఎన్నికల సంఘానికి మరోవైపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి లేఖలో రాస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో 1.6 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు అందుబాటులో ఉన్నప్పుడు వారి ద్వారా రోజుకు 20 మందికి పంపిణీ చేసినా సరే రెండు మూడు రోజుల్లో మొత్తం లబ్ధిదారులకు అందజేయవచ్చుననేది చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రతిపాదన. కానీ పోగాలము దాపురించిన వారికి హిత వాక్యములు చెవినికెక్కవు అనే సామెత రీతిగా ఈ మాటలను ప్రభుత్వ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు.

తమంత తాముగా ఒంటెత్తు పోకడలతో పింఛన్లను 74 శాతం మంది బ్యాంకు ఖాతాల్లో వేయడానికి మిగిలిన వారికి మాత్రం ఇళ్లవద్ద ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మొత్తం అందరికీ కూడా ఇళ్ల వద్ద ఇచ్చే ఏర్పాటు ఎందుకు చేయలేకపోతున్నారు?  మీ సమర్థత ఇంతేనా? అని ప్రశ్నించినందుకు చంద్రబాబును అసలు మనిషేనా అనే అభ్యంతరకర పదజాలంతో సజ్జల రామకృష్ణారెడ్డి దూషించడం అసహ్యం కలిగిస్తున్నది. ఆడలేని నాట్యగత్తె మద్దెల ఓడు అన్నది అనే సామెత మనకు తెలుసు. పెన్షనర్లకు ఇళ్ల వద్దకే పంపిణీ చేయడం చేతగానటువంటి జగన్ సర్కారు, ఎదురవుతున్న వైఫల్యాలు అన్నింటికీ చంద్రబాబే కారకుడు అన్నట్లుగా అతిశయంగా నిందిస్తున్నది.

Related Posts

Comments

spot_img

Recent Stories