కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని అత్యంత నీచమైన, అసభ్యమైన భాషలో దూషించిన కేసులో ఆమె చేతిలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. మొత్తం మూడు గంటల పాటు సాగిన విచారణలో పోలీసులు ఆయనకు 40 ప్రశ్నలు సంధించగా, వాటికి తాను రాతపూర్వకంగా సమాధానాలు ఇచ్చినట్లు విచారణ అనంతరం బయట విలేకరులతో మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి వెల్లడించారు. రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు సహజమేనని, వీటి ఆధారంగా కేసులు పెట్టి అరెస్టులు చేయడం ప్రారంభిస్తే రాష్ట్రంలో ఉండే జైళ్లు కూడా సరిపోవు అని ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
నోటి దురుసుతో తనకు చెల్లెలి వరుస అయ్యే మహిళా నాయకురాలిని అత్యంత నీచంగా, అసభ్యంగా దూషించి అభాసు పాలైన వ్యక్తి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఆ సమయంలో క్షణికావేశంలో తాను అలాంటి తప్పుడు మాటలు మాట్లాడినందుకు ఆయనలో కాస్తయినా పశ్చాత్తాపం కనిపించడం లేదు.
ప్రశాంతి రెడ్డి గురించి ఇలాంటి అసభ్యపు కారు కూతలు కూసిన తర్వాత ఆమె అభిమానులు ఆయన ఇంటి మీద దాడి చేశారు. ఆ సమయానికి పరారీలో ఉన్నటువంటి ప్రసన్న రెండు రోజులు కనిపించలేదు. తర్వాత మీడియా ముందుకు వచ్చి చికిత్స నిమిత్తం చెన్నై వెళ్లానని తాను ఇప్పుడు నగరంలోనే ఉన్నానని, పోలీసులకు ధైర్యం ఉంటే వచ్చి అరెస్టు చేసుకోవచ్చని నానా ప్రగల్భాలు పలికారు. ఈ లోగానే ఆయన మీద పోలీసు కేసు నమోదు అయింది. ఎట్టకేలకు ఇవాళ విచారణకు హాజరయ్యారు.
ఇప్పటికీ ఆయనలో పశ్చాత్తాపం మాత్రం కనిపించడం లేదు. రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు సహజం అని అత్యంత తేలికగా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన చెబుతున్నట్టుగా విమర్శలు చాలా సహజమేనని సరిపెట్టుకోవచ్చు.. కానీ ఆ విమర్శలు చేసే క్రమంలో వాడే భాష, వేసే నిందలలో కొంచమైనా సంస్కారం ఉండాలనే సంగతి అనేకమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈ సీనియర్ నాయకుడికి తెలియకపోతే ఎలాగ? కుసంస్కారానికి నిలువెత్తు ప్రతిరూపం లాగా చండాలపు మాటలతో విమర్శలు చేయడం కూడా రాజకీయాలలో అత్యంత సహజం అని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిరూపించదలచుకుంటున్నారా?
నగరి ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో రోజా చేసిన అవినీతి గురించి మాట్లాడినందుకే అసభ్యంగా దూషించారని నానా గోల చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి.. తమ ప్రత్యర్థులను మాత్రం పచ్చి బూతులు తిట్టడమే అలవాటు అని చాటి చెప్పదలుచుకుంటున్నారా? అనేది ప్రజలకు అర్థం కావడం లేదు. విచారణ తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుతానికి ఇంటికి వెళ్లారు. ఈ కేసులో పోలీసులు ఆయనను అరెస్టు చేసి కోర్టు ముందు నిలబెడతారా లేదా అనేది తర్వాతి సంగతి. కానీ విచారణలో వెల్లడించిన విషయాలు ఆ తర్వాత విలేకరులతో మాట్లాడిన తీరు గమనిస్తే ఆయన ప్రజల దృష్టిలో మరింత పతనం అయిపోయారని చెప్పవలసి వస్తుంది.