ఎన్డీయే కూటమి ప్రభుత్వం నింపాదిగా పాలన సాగిస్తుండడం సహజంగానే కొందరికి నచ్చదు. ఎన్డీయే చేపడుతున్న అమరావతి నిర్మాణం, పోలవరం డ్యామ్ లాంటివన్నీ గతంలో తాము అనుకూలంగా వ్యవహరించిన వ్యవహారాలే అయినప్పటికీ.. తెలుగుదేశం జనసేనలు భాజపాతో కలిసి స్థిరమైన పాలన అందిస్తుండడాన్ని వామపక్షాలు జీర్ణం చేసుకోలేకపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అందుకే, ఆ పార్టీలకు చెందిన కీలక నేతలు.. ప్రభుత్వం చేస్తున్న వారు హర్షించదగిన మంచి పనులను గురించి కనీసంగా కూడా పట్టించుకోకుండా.. కొన్ని పనుల గురించి మాత్రం బురద చల్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ దిశగా.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామక్రిష్ణ చాలా తరచుగా మీడియా ముందుకు వస్తుంటారు.
కేవలం చంద్రబాబునాయుడు మీద బురద చల్లడం మాత్రమే కాదు.. ఇప్పుడు కొత్తగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భజన చేయడానికి కూడా రామకృష్ణ దిగజారుతున్నారని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. టీటీడీకి సంబంధించిన వివాదాల్లో తలదూర్చిన ఈ వామపక్ష నేత భూమన మాటలను ఏకపక్షంగా సమర్థించకపోయినప్పటికీ.. వంద గోవులు మృతి చెందినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. నిజాలను నిర్ధరించి.. విచారణ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉన్నదంటూ సెలవిచ్చారు. నిజానికి రామకృష్ణ అక్కడితో ఆగిపోయి ఉంటే చాలా బాగుండేది.
కానీ ఆయన సుప్రీం కోర్టు ఏర్పాటుచేసిన ప్రత్యేకదర్యాప్తు బృందం పరిధిలో ఉన్న తిరుమలేశుని లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యి కల్తీ అయిందన్న కేసుపై కూడా తన అమూల్యమైన అభిప్రాయాలను సెలవివ్వడం విశేషం. నెయ్యి కల్తీ విషయంలో కూటమి ప్రభుత్వం పెద్దలు వైఎస్ జగన్ మీద ఆరోపణలు చేస్తూ వచ్చారని.. నెయ్యి కల్తీ అయితే దానికి అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఎలా బాధ్యులు అవుతారని.. ఆయన జగన్ తరఫు వకాల్తా పుచ్చుకుంటున్నారు.
టీటీడీకి అధికారులు, పాలకమండలి అంతా ఉంటారని.. సరుకులు నెయ్యి కొనుగోళ్లకు సంబంధించి బాధ్యత వహించాల్సిన వారు చాలా మందే ఉంటారని మరి జగన్ మీద ఎలా నిందలు వేస్తారని.. రామకృష్ణ, పాపం.. జగన్ మీద సానుభూతి కురిపిస్తున్నారు. అంతగా సన్నాయి నొక్కులు నొక్కుతున్న ఈ ఎర్రనేత.. మరి కేంద్ర వ్యవహారాలలో ఎందుకు ఈ లాజిక్ మిస్ అవుతుంటారో తెలియదెు.
మరి దేశంలో హిందూ అతివాదం గురించి ఎక్కడ ఏం జరిగినా సరే.. దానికి మోడీని బాధ్యుడిని చేసి ఎందుకు నిందిస్తారో తెలియదు. అయినా.. కమ్యూనిస్టు రచనలు మాత్రమే కాకుండా, కాసింత తెలుగు సాహిత్యం కూడా చదువుకుంటే.. ఆయనకు విషయాలు అర్థమవుతాయి. ‘సేన చెడుగైన దండనాధుని తప్పు’ అంటూ శతకకారుడు మనకు చెప్పనే చెప్పాడు. టీటీడీలో నెయ్యి కల్తీ అయితే.. కాంట్రాక్టులు అప్పగించే విషయంలో కీలకంగా ఉండే ఛైర్మన్ కు ఆ పాపంలో భాగం ఉండదా? అయినవారిని ఆ కీలక పదవిలో నియమించే క్విడ్ ప్రోకో ల నాయకుడు జగన్ కు ఆ పాపంలో వాటా ఉండదా? అని ప్రజలు అడుగుతున్నారు.
అయినా ఈ ఎర్రనేత హఠాత్తుగా జగన్ భజన ప్రారంభించి.. ఆయనకు వకాలత్తు పుచ్చుకోవడం వెనుక ఏమైనా మర్మం ఉన్నదా అని కూడా ప్రజలు అనుకుంటున్నారు.