కోవర్టు నేతలు కొంప ముంచుతారు బాబుగారూ!

అధికారం చుట్టూ అవకాశవాదులు.. బెల్లం చుట్టూ ముసిరే ఈగల్లా ముసురుతారు. ఈ విషయంలో సందేహం లేదు. అధికారం ఉన్న పార్టీ చెంతకు అందరూ ఎగబడి వస్తుంటారు. ఆ పార్టీల నాయకుల్ని ప్రలోభ పెట్టి తమ తమ సొంత పనులు చక్కబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ.. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోకుండా.. వారి ప్రలోభాలకు లోబడిపోతే ఎలా ఉంటుంది? ఎవ్వరైతే.. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన పాలన సాగిన రోజుల్లో ప్రభుత్వంలోంచి అన్ని దందాలను నడిపిస్తూ వచ్చారో.. వారి మాయలోనే కొత్త ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఇరుక్కుపోతే.. ఈ ప్రభుత్వానికి చెడ్డపేరు తప్పదు కదా? నిజానికి వైసీపీ దళాల్లోని పైరవీకారులు, దళారులు, అవకాశవాదులతో జట్టు కడుతున్న ప్రస్తుత పాలక కూటమిలోని నాయకులు.. కోవర్టులేనని.. ఏదో ఒకనాటికి కూటమి సర్కారు కొంప ముంచుతారని భయపడాల్సిన పరిస్థితి. ఇలాంటి వారి గురించి అప్రమత్తంగా ఉండడంపై ప్రజలు, పార్టీ కార్యకర్తలు చంద్రబాబునాయుడును హెచ్చరిస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి జమానాలో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తో అనుబంధాన్ని పెంచుకుని.. ఆయన అండతో అడ్డగోలు దందాలు సాగించిన తులసిబాబు అనే వ్యక్తి.. గుడివాడలో తెలుగుదేశం అభ్యర్థి గెలుపులో ఎంతో కీలకంగా ఉపయోగపడ్డాడని చెప్పుకోవడమే పార్టీకి సిగ్గు చేటు వ్యవహారం. అలాంటి తులసిబాబు.. డిప్యూటీ స్పీకరు రఘురామక్రిష్ణ రాజు మీద జగన్ పాలన కాలంలో జరిగిన కస్టోడియల్ హత్యాప్రయత్నం సమయంలోనూ అసలు పాత్రధారి అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నిందితుల గుర్తింపు పెరేడ్ లో రఘురామ గుర్తించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అలాంటి తులసిబాబు నిన్నటిదాకా అంటకాగుతూ నిర్ణయాలు తీసుకున్న, ప్రభావితం అయిన.. నియోజకవర్గాన్ని మొత్తం అతని చేతుల్లో పెట్టేసిన ఎమ్మెల్యేను ఎలా పరిగణించాలి.

అదొక్కటే కాదు.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవడానికి ఘోరమైన స్థితికి చేరుకున్న రోడ్లు కూడా ఒక కారణం అనే సంగతి అందరికీ తెలుసు. అయితే జగన్ ఎన్నికలకు ముందు అతి తెలివితేటలు చూపిస్తూ 2023-24 మద్య కాలంలో 2300 కోట్ల రూపాయల రోడ్డు మరమ్మతు పనులకు టెండర్లు ఓకే చేశారు. సహజంగానే పనులన్నీ వైసీపీ వారికే కేటాయించారు. కొన్ని పెద్ద పనులను, పెద్ద నాయకుల బినామీల పేరిట పెట్టారు. పనులు పూర్తిచేసేస్తే.. ఎన్నికల నాటికి ప్రజల ఎదుట కాస్త పరువు దక్కుతుందని ఆశపడ్డారు. కానీ.. జగన్ కంటె తెలివైన వారైన ఆ పార్టీ కాంట్రాక్టర్లు.. ఈ పార్టీ గెలుస్తుందో లేదో.. బిల్లులు వస్తాయో రాదో అనే భయంతో ఒక్క పనిని కూడా పూర్తిచేయలేదు. కొన్నింటిని ప్రారంభించి వదిలేశారు. వీటన్నింటినీ గమనించిన కూటమి సర్కారు.. ఆ పనులను రద్దుచేసింది. ఇంతవరకు అంతా సవ్యంగా ఉందని అనుకుంటూ ఉండగా.. పాత కాంట్రాక్టర్లతోనే పనులు చేయించాలని.. కొందరు కూటమి పార్టీల పెద్దలు ఒత్తిడి తెస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వీరందరూ వైసీపీ కాంట్రాక్టర్ల ప్రలోభాలకు లోబడుతున్నారని అర్థం చేసుకోవాల్సి వస్తోంది. ఇలాంటి నాయకులు తెచ్చే ఒత్తిళ్ల పట్ల చంద్రబాబునాయుడు అప్రమత్తంగా ఉండాలని.. వీరే కోవర్టులుగా ప్రభుత్వాన్ని ముంచే ప్రమాదం ఉందని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories