క్రైస్తవ ముసుగులో నకిలీ మోసాలను కట్టడి చేయాలి!

నకిలీ విద్యా సంస్థలను నిర్వహించడం అంటే విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడమే. తమను తాము విద్యాసంస్థలుగా ప్రకటించుకుని విద్యార్థులను చేర్చుకొని, వారి నుంచి ఫీజులు వసూలు చేస్తూ వారికి చెల్లుబాటు కానీ డిగ్రీలు ప్రదానం చేసేసి, ఆ తర్వాత వారి జీవితం ఎటు కాకుండా పోయేలా చేయడం నకిలీ యూనివర్సిటీల పని! అలాంటి నకిలీ యూనివర్సిటీలను యుజిసి గుర్తించి ప్రకటిస్తున్నది గాని, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి మీద చర్యలు తీసుకోవడం లేదు. అలాంటి నకిలీ యూనివర్సిటీలను నిర్వహిస్తున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం విచారించి, వారి తప్పుడు వ్యవహారాలపై చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి మోసాలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండవు.
దేశవ్యాప్తంగా 21 నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్లుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ప్రకటించింది. వాటిలో ఆంధ్రప్రదేశ్లోనే రెండు యూనివర్సిటీలు ఉన్నట్లుగా తేల్చారు. గుంటూరు కాకుమాని వారి తోటలోని క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, అలాగే విశాఖపట్నంలోని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా అనేవి ఆ నకిలీ వర్సిటీలు. రెండు కూడా క్రైస్తవ అనుబంధ సంస్థల రూపంలో నడుస్తున్నవే.

వీటి ద్వారా ఏ కార్యకలాపాలు జరుగుతున్నాయో గమనించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. నిజానికి ఎవరో ఒకరు యూనివర్సిటీ అని బోర్డు పెట్టేసుకొని వ్యాపారం చేస్తూ ఉంటే.. ప్రభుత్వం కళ్లు మూసుకొని ఉపేక్షించజాలదు. సాధారణంగా ఇలాంటి నకిలీ విద్యాసంస్థల వలన విద్యార్థులు పెద్ద సంఖ్యలో నష్టపోయి వారి బతుకులు రోడ్డున పడి పోలీసు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వం స్పందిస్తూ ఉంటుంది. అప్పుడు చర్యలు తీసుకుని తప్పుడు పనులు చేసిన వారిని కటకటాల వెనక్కు నెడుతూ ఉంటారు.  కానీ అప్పటికే ఆయా విద్యార్థుల జీవితాలు నాశనమై ఉంటాయి లేదా వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంవత్సరాలను వాళ్లు కోల్పోయి ఉంటారు.

విద్యార్థిలోకానికి ఈ నష్టం జరగకుండా నకిలీ యూనివర్సిటీలను ముందే గుర్తించి వాటిపై చర్య తీసుకుంటే వారి దోపిడీని కట్టడి చేస్తే అందరికీ మేలు జరుగుతుంది. ప్రభుత్వం తమంత తాముగా గుర్తించకపోయినప్పటికీ కనీసం యూజీసీ వంటి సంస్థలు దేశంలోని నకిలీ యూనివర్సిటీల జాబితాలను ప్రకటించినప్పుడు వాటి మీద చర్యలు తీసుకోవడం కనీస ధర్మం. ఒక నకిలీ యూనివర్సిటీ కొన్నాళ్లపాటు నడిచింది అంటే, కొన్ని వందల వేల మంది జీవితాల మీద దుష్ప్రభావం చూపిస్తుంది. క్రైస్తవ అనుబంధ సంస్థల ముసుగులో నడుస్తున్న ఈ నకిలీల లీలలను ప్రభుత్వం కట్టడి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇవి ఎప్పుడు ఏర్పాటు అయ్యాయో.. వీటి నకిలీ దందాలకు సహకరించినది ఎవ్వరో అందరినీ కటకటాల వెనక్కు పంపాలని కోరుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories