మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తాను ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారీ.. విద్యావ్యవస్థ గురించి ప్రత్యేకంగా ప్రస్తావన తెస్తుంటారు. తాను రాష్ట్రంలోని విద్యావ్యవస్థను సమూలంగా ఉద్ధరించేస్తే.. చంద్రబాబునాయుడు వచ్చి దానిని చెడగొడుతున్నారని జగన్ పదేపదే చెబుతుంటారు. ఇంగ్లిషు మీడియం, ఇంటర్నేషనల్ మోడల్ సిలబస్, విద్యార్థులకు ట్యాబ్ లు, బైజూస్ తో కోచింగ్ లాంటి పడికట్టు మాటలు మాట్లాడుతూ ఉంటే.. ప్రజలు తనను ఎల్లకాలమూ నమ్ముతూ ఉంటారని, తన మాయలో పడుతూ ఉంటారని జగన్ ఇప్పటికీ అనుకుంటూ ఉంటారు. కానీ.. విద్యావ్యవస్థలో అసలైన నిర్వహణ అంటే ఏమిటో, విద్యావ్యవస్థను, విద్యార్థుల మంచిచెడులను నిజంగా ఉద్ధరించడం అంటే ఏమిటో చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఇప్పుడు నిరూపిస్తోంది. దేశచరిత్రలోనే ఎక్కడా ఎన్నడూ లేనివిధంగా.. తొలిసారిగా మెగా పేరంట్ టీచర్స్ మీటింగులు నిర్వహించడం ద్వారా.. ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా.. ఆ కార్యక్రమాలకు స్వయంగా హాజరై.. పిల్లలతో వారి తల్లిదండ్రులతో విలువైన సమయాన్ని గడపడం ద్వారా..ఒక కొత్త శకానికి శ్రీకారం చుట్టారు.
జగన్మోహన్ రెడ్డి.. తన పరిపాలన కాలంలో.. తెలుగు భాషను మూలాలనుంచి భ్రష్టుపట్టించడమే తన లక్ష్యం అన్నట్టుగా.. నూరుశాతం ఇంగ్లిషు మీడియం అనే పదాన్ని ప్రజల మీద, విద్యార్థుల మీద రుద్దడానికి ప్రయత్నించారు. విద్యార్థులను ఒత్తిడికి గురిచేశారు. జీఆర్ఈ, టోఫెల్ కోచింగులని ఎలిమెంటరీ స్కూలు వయసు నుంచి రకరకాల డ్రామాలను ప్రారంభించారు. బైజూస్ వారు వీడియో పాఠాలు బోధిస్తారంటూ.. బైజూస్ బృందాలకంటె ఎంతో ఉన్నతవిద్యావంతులైన రాష్ట్ర టీచర్ల ఆత్మగౌరవాన్ని ఆయన తాకట్టు పెట్టారు. ఒకరకంగా టీచర్ల కమ్యూనిటీని అవమానించారు. ఐసీఎస్ఈ సిలబస్ అన్నారు. ట్యాబ్ లు అన్నారు.. జాగ్రత్తగా గమనిస్తే.. ఇవన్నీ కూడా ప్రెవేటు వ్యాపారులతో డీల్స్ కుదుర్చుకోవడానికి వేసిన ఎత్తుగడలే అని అర్థం అవుతుంది. ఈ ముసుగులో భారీగా వందల కోట్ల రూపాయలు దోచుకున్నారని కూడా అర్థమవుతుంది.
ఈ పడికట్టు మాయమాటలు చెప్పడమే విద్యారంగాన్ని ఉద్ధరించడం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి .. విద్యాలయాలు గంజాయి అడ్డాలుగా తయారవుతున్నా పట్టించుకోలేదు. అనేక రకాలుగా భ్రష్టుపట్టిపోతున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ పాపాలన్నింటినీ చక్కదిద్దడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం పూనుకుంటోంది. మెగా పేరంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం ఆ క్రమంలో ఒక పెద్ద ముందడుగు. ఇలాంటి చర్యల వలన.. విద్యార్థుల చదువుల గురించి తల్లిదండ్రులు అనుకుంటున్నది, వారు కోరుకుంటున్న మార్పు చేర్పులు అన్నీ ప్రభుత్వానికి తెలుస్తాయి. విద్యార్థుల చదువుల పట్ల తల్లిదండ్రుల్లో కూడా మరింత బాధ్యతను పెంచడం సాధ్యమవుతుంది. ఇవి విద్యార్థుల చదువులకు నిర్మాణాత్మక పునాదులు వేస్తాయి. జగన్ సర్కారు పేరెంట్స్ మీటింగులను కూడా రాజకీయ సభల్లా ప్రచారానికి వాడుకోవాలని అనుకుంది. చంద్రబాబు ప్రభుత్వం ఎంతో క్రియాశీలంగా అడుగులు వేస్తోంది. ఇలాంటి చర్యల వల్ల.. ప్రెవేటు పాఠశాలల నుంచి కూడా ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లకు వచ్చి చేరే అవకాశం ఉంటుందని పలువురు ఆశిస్తున్నారు.