ప్రపంచం మొత్తం కూడా తలతిప్పి చూసేలా అమరావతి రాజధానిని అద్భుతంగా దిద్దుతానని విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రజలకు మాట ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషించారు. సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టుగా విధులకు వెతుకులాట ఎక్కువగా ఉండని ప్రాజెక్టుగా అమరావతి నిర్మాణ ప్రణాళికను చంద్రబాబు నాయుడు సిద్ధం చేసినప్పుడు ప్రజలు మనస్ఫూర్తిగా అభినందించారు. అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఒక అద్భుత నగరం పూర్తయితే ఆ కీర్తి మొత్తం చంద్రబాబు ఖాతాలోకి వెళుతుందని భయపడ్డారు. అమరావతిని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఆయన కేవలం అమరావతి రాజధాని ప్రాంతాన్ని మాత్రమే కాదు.. అమరావతిలో నివసిస్తున్న ప్రజల మీద, పేదల మీద కూడా ద్వేషాన్ని పెంచుకున్నారు. వారిని కూడా ఇక్కట్ల పాలు చేశారు. అయితే అలాంటి తప్పులన్నింటినీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిద్దుతోంది.
అమరావతి ప్రాంతంలో నిరుపేదలకు ప్రభుత్వం కేటాయించిన టిడ్కో ఇళ్లకు తమ పార్టీ రంగులు వేసి ఆనందించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వాటిలో కొన్నింటిని ప్రజలకు కేటాయించినప్పటికీ.. ఆ నివాసాల వైపు ఎటువంటి కనీస వసతులు కల్పించకుండా వారిని వేధించింది. అమరావతిలోని టిడ్కో ఇళ్ల ప్రాంతాల్లో విపరీతంగా పిచ్చి మొక్కలు పెరిగే ఆ ప్రాంతమంతా చిట్టడివిలా తయారైంది. అమరావతి మొత్తాన్ని మరుభూమిలా మార్చేయ దలచుకున్న జగన్ సర్కారు సహజంగానే వీరి కష్టాలను కూడా పట్టించుకోలేదు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిలో చేపట్టిన జంగిల్ క్లియరెన్స్ పనుల వలన పేదలు కాస్త సౌకర్యవంతమైన జీవితాన్ని పొందగలుగుతున్నారు. వారి ఇల్లు చుట్టూ ఉండే పొదలు, పిచ్చి మొక్కలు అన్నింటినీ తొలగించడం జరిగింది. ఆ ప్రాంతం క్లియర్ అవుతొంది. అలాగే సగంలో ఆగిన నిర్మాణాల ప్రాంతంలోని జంగిల్ క్లియరెన్స్ పనులన్నీ శరవేగంగా పూర్తవుతున్నాయి.
మరొకవైపు అమరావతి ప్రాంతంలోని నిర్మాణాలను పరిశీలించి వెళ్లిన ఐఐటి నిపుణుల బృందాలు తమ నివేదికలను సమర్పించిన పిమ్మట, వెంటనే పనుల పునరుద్ధరణ ప్రారంభమవుతుందని మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటిస్తున్నారు. క్రెడాయ్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో.. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలలో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామని నారాయణ చేసిన ప్రకటన ప్రజలలో కొత్త ఆశలకు ఊపిరి పోస్తోంది.నిపుణుల నివేదికలు వచ్చేలోగా జంగిల్ క్లియరెన్స్ వంటి పనులన్నీ పూర్తి అయితే గనుక నిర్మాణాలు వేగంగా జరగడానికి ఆస్కారం ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు పిలుపుమేరకు అమరావతి నిర్మాణానికి ప్రపంచ వ్యాప్తంగా విరాళాలు కూడా పోటేత్తుతున్న నేపథ్యంలో పనులను పునః ప్రారంభించడానికి ఎలాంటి ఆటంకం ఉండదని కూడా ప్రజలు సంతోషిస్తున్నారు.