బాలినేని కోడలు చుట్టూ చెలరేగిన వివాదం!

అభ్యర్తులకు అనుకూలంగా వారి కుటుంబసభ్యులు ప్రచారం చేయడం కొత్త విషయం కాదు. కానీ అనవసరమైన వివాదంలో చిక్కుకోవడం, గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చినట్టుగా వివాదాన్ని పెద్ద రాద్ధాంతంగా మార్చుకోవడం ఒంగోలులోనే జరిగింది. ఒంగోలులో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ తరఫున పోటీచేస్తున్నారు. ఆయన తరఫున కోడలు శ్రీకావ్య ఎన్నికల ఇంటింటి ప్రచారానికి వెళ్లింది.

అయితే.. ప్రతి ఇంటికీ జగనన్న చేసిన మేలు, ఇచ్చిన డబ్బు వివరాలు మొత్తం ఏకరవు పెట్టాలని అనుకున్నదో ఏమోగానీ.. తన వెంట స్థానిక వాలంటీరును కూడా వెంటబెట్టుకుని వెళ్లింది. వాలంటీరు ప్రచారంలో రావడానికి తెలుగుదేశం వారు ప్రశ్నించడం, వైసీపీ కార్యకర్తలు వారి ఇంటిమీద పడి విధ్వంసం సృష్టించడం, ప్రశ్నించిన తెలుగుదేశం వారిపై హత్యాయత్నానికి తెగబడడం, ఇవన్నీ చేసిన తర్వాత తిరిగి తెలుగుదేశం వారే దాడికి దిగారంటూ లేకి ఆరోపణలు చేయడం అవన్నీ ఆటోమేటిగ్గా జరిగిపోయాయి. బాలినేని అనవసరంగా ఈ వివాదంలో ఇరుక్కున్నారని ప్రజలు అనుకుంటున్నారు.


ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి అసలే గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్ ఇవ్వాల్సిందేనని, లేకపోతే ఆ ప్రభావం తన ఎన్నిక మీద కూడా పడుతుందని.. ఆయన జగన్ వద్ద చాలా గట్టిగా పట్టుపట్టారు. కానీ ఆయన మాటను జగన్ ఇసుమంత కూడా ఖాతరు చేయనేలేదు. చివరికి మాగుంట తెలుగుదేశం టికెట్ దక్కించుకున్నారు. బాలినేని ఎమ్మెల్యేగా సుదీర్ఘమైన బుజ్జగింపుల తర్వాత బరిలోకి దిగారు.
అసలే కష్టకాలం. కోడలు ప్రచారం చేస్తోంటే.. ఆమె వెంట ఉన్న వాలంటీరును ఫోటో తీయడానికి తెలుగుదేశం కార్యకర్త చప్పిడి ప్రభావతి ప్రయత్నించారు. దీనిని వైసీపీ నాయకులు అడ్డుకుని రచ్చరచ్చ చేశారు. వారి మీద దాడికి దిగారు. కొట్టారు. ఈ వీడియోలన్నింటినీ తెదేపా అబ్యర్థి దామచర్ల జనార్దన్, ఎంపీ అభ్యర్థి మాగుంట జిల్లా ఎస్పీకి చూపించారు కూడా. అయితే బాలినేని మాత్రం తన కోడలిమీద దాడికి వచ్చారంటూ ఆరోపణలు చేయడం విశేషం.

నిజానికి వైసీపీ అభ్యర్థులు చాలా మంది.. వాలంటీర్లను ప్రచారంలో వాడుకుంటూనే ఉన్నారు. వారితో రాజీనామాలు చేయించి.. వేతనాలు తాము సొంతంగా చెల్లిస్తున్నారు. బాలినేని కూడా వాలంటీర్ల అవసరం ఉందని భావించి ఉంటే అలాచేస్తే సరిపోయేది. అలా కాకుండా.. వారితో రాజీనామా చేయించకుండా, ప్రచారాంలో వాడుకోవాలని చూడడం వల్లనే రాద్ధాంతం జరిగిందని తెలుస్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories