తూచ్ అంటున్న వివాదాస్పద అధికారి!

జగన్మోహన్ రెడ్డి జమానాలో అత్యంత వివాదాస్పదుడిగా పేరుపొందిన అధికారికి ఇప్పుడు భయం పట్టుకుంది. తెలుగుదేశం పార్టీ గెలిస్తే గనుక తాను ప్రభుత్వంలో ఉండనే ఉండను అంటూ భీషణప్రతిజ్ఞలు చేసిన ఆయన.. ఎన్నికల ఫలితాల తర్వాత మాట నిలబెట్టుకుంటూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఏదో డాన్సులు చేసుకుంటూ, ఇన్ స్టాలో రీల్స్ పెట్టుకుంటూ జీవితాన్ని సరదాగా గడపవచ్చునని అనుకున్నారు. కానీ వాస్తవంలో అనుకున్నట్టుగా జరగలేదు. జగన్ దళంలో కీలక అధికారిగా ఉంటూ తాను పాల్పడిన సకల అక్రమాలు అరాచకాల వ్యవహారాలన్నీ ఒక్కటి ఒక్కటిగా బయటకు వస్తున్నాయని భయం పెరిగింది. బయట ఉండడం కంటే ఏదో ఒక లూప్ లైను పదవిలో ప్రభుత్వం లో అధికారిగా ఉండడమే మంచిది- అనే భావనకు ఇప్పుడు వచ్చారు. ‘అబ్బెబ్బే వాలంటరీ రిటైర్మెంట్ నాకు అక్కర్లేదు.. తిరిగి ఏదో ఒక పోస్టింగ్ ఇవ్వండి’ అంటూ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇలా అటు ఇటు గంతులు వేస్తున్న ఈ ఐఏఎస్ అధికారి మరెవరో కాదు ప్రవీణ్ ప్రకాష్!

ఎన్నికలకు ముందు నుంచే ప్రభుత్వం మారితే పరిస్థితి వేరేగా ఉంటుందని తాను ఉద్యోగంలో కొనసాగే వాతావరణం ఉండదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చర్చల్లోకి వచ్చిన అధికారి ప్రవీణ్ ప్రకాష్. ఆయన భయానికి తగినట్లుగానే తెలుగుదేశం పార్టీ గెలిచింది ఆయనను పక్కన పెట్టింది కూడా.

జగన్ దళంలో కీలక సభ్యుడి గా అనేకమంది అధికారులను వేధించడంలోనూ, అనేకమంది పై కేసులు బనాయించడంలోనూ, చివరికి ఋషికొండను ధ్వంసం చేసి నివాసం నిర్మించుకోవాలి అనే ఆలోచన జగన్ బుర్రలోకి చొప్పించడంలోనూ కూడా ప్రవీణ్ ప్రకాష్ పాత్ర ఉన్నదనే వాదనలు వ్యాప్తిలో ఉన్నాయి. ప్రత్యేకించి ఉపాధ్యాయ వర్గాలను ఆయన వేధించుకు తినేశారని అందరూ అంటుంటారు. ఉపాధ్యాయులపై కక్ష కట్టినట్టుగా ప్రవర్తించి జగన్ ప్రభుత్వం పట్ల ఆ వర్గంలో వ్యతిరేకత ఏర్పడడానికి ప్రధాన కారకుడుగా నిలిచింది కూడా ప్రవీణ్ ప్రకాశే.

ఆయన విఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న వెంటనే ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గారిని ఆమోదించడం జరిగింది. సెప్టెంబర్ 30 నుంచి అది అమలులోకి వస్తుందని ప్రకటించడం కూడా జరిగింది. అయితే ‘క్షణక్షణం మారుచుండు చిత్తముల్’ అన్న సామెత చందంగా ప్రవీణ్  ప్రకాష్ ఈ లోగా మనసు మార్చుకున్నారు. తాను తిరిగి ఏదో ఒక పదవిలో చేరాలని అనుకుంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వ పెద్దలను కలవడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరూ అందుకు సమ్మతించడం లేదు. జగన్మోహన్ రెడ్డి వెంట ఉండి సాధించిన దందాలకు తోడుగా బొత్స సత్యనారాయణ విద్యా శాఖ మంత్రిగా ఉండగా ఆయనతో కలిసి ఆ శాఖలో అనేక కాంట్రాక్టుల విషయంలో వందల కోట్ల అవినీతికి పాల్పడిన ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఈ అరాచకాలపై కేసులు నమోదు చేస్తే పదవిలో ఉన్న అధికారిగా న్యాయపోరాటం చేయడానికి- వీఆర్ఎస్ లో బయట ఉన్న అధికారి న్యాయపోరాటానికి మధ్య తేడా ఉంటుందని ముందు చూపుతోనే ఆయన తిరిగి సర్వీసులో చేరాలని ఆలోచిస్తున్నట్లు గా తెలుస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవీణ్ ప్రకాష్ ని తిరిగి సర్వీసులోకి అనుమతించకూడదని స్థిర నిశ్చయంతో ఉన్నట్లు సమాచారం.

Related Posts

Comments

spot_img

Recent Stories