జగన్మోహన్ రెడ్డి తనకు తగులుతున్న ఎదురు దెబ్బలకు తాళలేక వాటికి ఎదురు నిలిచే ప్రయత్నంలో పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ అరాచకాలను కప్పిపుచ్చుకునేందుకు ఆయన అధికార పార్టీ మీద చేస్తున్న విమర్శల పరంపరలో ఇలాంటి పరస్పర విరుద్ధ మాటలతో తన పరువు తానే తీసుకుంటున్నారు. పైగా అడ్డంగా దొరికి పోయేలాగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. తమ పార్టీ అరాచకాలు, నేరాలు ఒక్కొక్కటి బయటకు వస్తుండగా.. ఒక కేసు విషయంలో ఒకలాగా.. ఇంకో కేసు విషయంలో ఇంకోలాగా దర్యాప్తు సాగాలని ఆయన చెబుతుండడమే తమాషా.
ఉదాహరణకు విజయవాడ ప్రకాశం బ్యారేజీ మీదికి ప్రయోగించిన మూడు బోట్ల విషయంలో జగన్ మాటలు ఒకరకంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద జరిగిన దాడి కేసులో నందిగం సురేష్ అరెస్టుకు సంబంధించి చెబుతున్న మాటలు మరోరకంగా ఉంటున్నాయి. ప్రకాశం బ్యారేజీ గేట్లు ధ్వంసం చేయడానికి కుట్రపూరితంగా వెళ్లిన బోట్లు తెలుగుదేశానికి చెందిన వారివే అని జగన్ వాదిస్తున్నారు. వాళ్లకి తెలుగుదేశం నాయకులతో సంబంధం ఉందని అంటున్నారు. చంద్రబాబుతో లోకేష్ తో ఆ బోట్ల యజమానులు ఫోటోలు కూడా దిగారు- అని చెబుతున్నారు. కానీ అలాంటి ఫోటోలు మాత్రం చూపించలేదు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఆ బోట్లకు అనుమతులు వచ్చాయని కూడా ఆయన సెలవిస్తున్నారు. అనుమతులు రావడం అంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీకి చెందిన వ్యక్తులకు మాత్రమే జరుగుతుంది- అనే భ్రమలో జగన్మోహన్ రెడ్డి యింకా బతుకుతున్నట్టుగా ఉంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే నందిగం సురేష్ విషయంలో ఆయన వాదనలు విరుద్ధంగా ఉన్నాయి. నాలుగేళ్ల కిందట జరిగిన తెలుగుదేశం పార్టీ మీద దాడి కేసులో నందిగం సురేష్ లేడని జగన్ సర్టిఫై చేస్తున్నారు. అప్పటి ఆయన కాల్ రికార్డులను, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే సరిపోతుందని జగన్ అంటున్నారు. ఇదే తరహాలో కాల్ రికార్డులను బోట్ల యజమానుల విషయంలో కూడా పరిశీలిస్తే అసలు తెరవెనుక ఉన్న నేరస్తులు, అసలుకుట్రదారులు ఎవరో బయటకు వస్తారని జగన్ ఎందుకు అనలేకపోతున్నారో తెలియదు. ఇలా పరస్పర విరుద్ధమైన మాటలతో జగన్మోహన్ రెడ్డి అడ్డంగా బుక్కైపోతున్నారని ప్రజలు భావిస్తున్నారు.