పవన్- బిజెపి మధ్య చిచ్చుకు సజ్జల కుట్రలు!

ఒక వ్యక్తి ఒక విషయంలో ఒక కలగని, ఆ తర్వాత దానినే ఒక ఊహగా ప్రతిపాదించి.. ఆ పిమ్మట అదే ఊహను తీర్మానంగా ప్రకటించడం జరిగితే అంతకు మించిన భ్రస్ట వ్యవహారం మరొకటి ఉండదు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సజ్జల రామక్రిష్ణా రెడ్డి మాటలు గమనిస్తే.. ఈ సిద్ధాంతం నిజమే అనిపిస్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ పతనానికి కీలక కారకుడు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ.. ఆయన వల్లనే అనేకమంది నాయకులు పార్టీని వీడి వెళ్లిపోతున్నప్పటికీ.. ఇంకా తన ప్రాధాన్యం ఏమాత్రం తగ్గకుండా నెంబర్ టూ హోదాలో చెలామణీ అవుతున్న వ్యక్తి సజ్జల రామక్రిష్ణారెడ్డి. ఆయన హవా అప్రతిహతంగా నడుస్తూనే ఉంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాజ్యం చేస్తుండగా.. ఆ కూటమి పార్టీల్లో విభేదాలు చీలికలు రావాలనేది సజ్జల కల! ఆయన కోరిక! ఆ కల ఎలా తీరుతుందో.. ఎప్పటికి తీరుతుందో.. ఆయనకు తెలియదు. ఏదైనా ఒక పరిణామం కనిపిస్తే ఆ కల నిజమౌతున్నట్టుగా ఆయన ఊహించుకుంటున్నారు. ముందుగా ఆ ఊహను ప్రజల్లోకి నెట్టేసి.. ఆ తర్వాత అది నిజం అయిపోయినట్టుగా తానే ధ్రువీకరిస్తూ ప్రకటనలు కూడా చేసేస్తున్నారు. ఎలాగంటే-

ఎన్డీయే కూటమి పార్టీలు చాలా ఐక్యదృక్పథంతో పాలన సాగిస్తున్న సంగతి అందరికీ తెలుసు. ప్రధానంగా జనసేన- బిజెపి లు ముందునుంచి ఒక జట్టుగా ఉంటూ.. ఎన్నికల ముందు తెలుగుదేశంతో జట్టు కట్టి అధికారంలోకి వచ్చాయి. ముందుగా బిజెపి- జనసేన మధ్య కూడా మైత్రీ బంధం చెడిపోయేలా ముసలం పుడితే బాగుండునని సజ్జల కోరుకుంటున్నారు. తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిన కల్తీ చేసిన దుర్మార్గానికి వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను ప్రకటించి.. కాషాయ దుస్తులతో దీక్ష చేయగానే.. సజ్జల తన ముద్రగల సరికొత్త భాష్యంతో సిద్ధం అయిపోయారు. పవన్ కల్యాణ్ కాషాయం కట్టి.. భారతీయ జనతా పార్టీ కంటె తాను ముందు వరుసలో ఉన్నానని చెప్పాడని.. సనాతన ధర్మానికి తానే ఛాంపియన్ అన్నట్టుగా పవన్ కల్యాణ్ తీసుకున్న లైన్ బిజెపి పెద్దలకు నచ్చడం లేదని సజ్జల చెబుతున్నారు. దీనిని బట్టి వారు ఎంత కాలం కలిసుంటారో కూడా తెలియడం లేదని సజ్జల సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 

నెయ్యి కల్తీ చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా పవన్ కాషాయం కట్టి దీక్ష చేసిన మాట ఒక్కటే వాస్తవం. అంతే తప్ప.. ఆయన సనాతన ధర్మానికి తనను చాంపియన్ గా ప్రకటించుకోలేదు. దేశవ్యాప్తంగా ధర్మాన్ని  కాపాడేందుకు ఛాంపియన్ వంటి ఒక వ్యవస్థ కావాలని మాత్రమే ఆయన అన్నారు. సనాతన ధర్మాన్నే భారతీయ జనతా పార్టీ కూడా ఆదరిస్తున్నప్పుడు.. అదే పని తమ కూటమిలోని మరొకరు కూడా చేస్తే ఆ పార్టీ సంతోషిస్తుందే తప్ప.. వారికి ఆ లైన్ నచ్చడం లేదని అభివర్ణించడం సజ్జల యొక్క కుట్ర! ఆ మాటకొస్తే.. మోడీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో ఉండే దాదాపు అన్ని పార్టీలు కూడా.. హిందూత్వ భావజాలానికి అనుకూలంగా ఉండేవే. కానీ.. తన ఊహలను చిలవలుపలవలుగా చేసి.. జనసేన- బిజెపి మధ్య చిచ్చు పెట్టడానికి వైసీపీ నాయకుడు సజ్జల నానా పాట్లు పడుతున్నట్టుగా కనిపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories