ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరగడానికి పూర్వం.. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు, అభిప్రాయభేదాలు, అసంతృప్తులు ఉండేవి. విభజన తర్వాత అవన్నీ ప్రజలు మరచిపోయారు. ఇప్పుడు అందరూ అన్నదమ్ముల్లా మెలగుతున్నారు. ఇలాంటి సమయంలో రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలాగా తెలంగాణకు చెందిన ఒక కాంగ్రెస్ ఎంఎల్ఏ దురుసు వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. తెలంగాణ ఎమ్మెల్యేలు తలచుకుంటే ఏపీ ప్రజలను తెలంగాణలోకి అడుగు పెట్టనివ్వకుండా చేయగలం అని ఎంఎల్ఏ మాట్లాడడం వివాదంగా మారుతోంది.
తెలంగాణలోని జడ్చర్ల ఎంఎల్ఏ అనిరుద్ద రెడ్డి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. తెలంగాణ ఎంఎల్ఏ ల సిఫారసు ఉత్తరాలకు టీటీడీ విలువ ఇవ్వడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనుచరులను తిరుమల దర్శనానికి పంపాలంటే ఆయనకు చాలా ఇబ్బందిగా ఉన్నదట. తాము యాదగిరిగుట్ట, భద్రాచలం ఆలయాల్లో ఏపీ ఎంఎల్ఏ ల సిఫారసు ఉత్తరాలను పరిగణిస్తున్నామని, తిరుమలలో తమ ఉత్తరాలను పట్టించుకోవడం లేదని అంటున్నారు. తాము అనుమతిస్తేనే ఏపీ వాళ్లు తెలంగాణలో వ్యాపారాలు చేసుకోగలుగుతున్నారని అంటున్నారు. తాము తలచుకుంటే ఏపీ వాళ్ళెవరూ తెలంగాణలోకి రాకుండా చేయగలమని అంటున్నారు.
కావలిస్తే భద్రాచలం లో ఏపీ ఎంఎల్ఏ ల సిఫారసు ఉత్తరాలను పట్టించుకోకుండా చేయగలరు తప్ప.. రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా ఇలాంటి మాటలు గౌరవ ప్రదమైన పదవిలో ఉన్న ఎంఎల్ఏ కు తగవని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.