11 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి అడుగు బయటకు పెట్టడం అనేది ఆ పార్టీ వారికి ఒక మహాద్భుతం అన్నట్టుగా కనిపించేలా ఉంది. ఆయన ప్రజల మధ్య కనిపించేలా కార్యక్రమం ప్లాన్ చేసుకుంటే చాలు.. అప్పటికే అక్కడకు పుష్కలంగా జనాన్ని తరలించేస్తున్నారు. వారందరూ సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఈ హోరు గమనిస్తే.. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నట్టుగా.. ఈ ఎన్నికల్లో జగన్ సీఎం అయిపోతారనే ఆశాభావాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎన్నికలు ఇంకా నాలుగున్నరేళ్ల దూరంలో ఉన్నాయని మనకు అనిపించదు. అయితే తాడేపల్లి వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ఈ ‘సీఎం సీఎం’ నినాదాల పట్ల జగన్మోహన్ రెడ్డి చాలా అసహనంగా ఉన్నారట. మధనపడిపోతున్నారట. తన అభిమానులే తనను వెక్కరిస్తున్నట్టుగా ఆయన బాధపడిపోతున్నారట.
గతంలో పవన్ కల్యాణ్.. ఎక్కడ సభ నిర్వహించినా సరే.. ఆయన అభిమానులు ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలు చేస్తుండేవారు. పవన్ మాటలకు కూడా అడ్డుపడుతుండేవారు. పవన్ కల్యాణ్ చాలా సేపు వారిని బతిమాలి.. సద్దుమణిగాక ప్రసంగించాల్సి వచ్చేది. అయితే పవన్ కల్యాణ్ గురించి ఆయన అభిమానులు ‘సీఎం నినాదాలు’ చేయడానికి ఒక లాజిక్ ఉంది. అప్పటిదాకా పవన్ రాజకీయ పదవులు అధిష్టించలేదు. పార్టీ స్థాపించిన అధినేతగా ఆయన సభలు పెట్టినప్పుడు.. అభిమానులు సహజంగా ‘సీం నినాదాలు’ చేయడం శోభిస్తుంది. అయితేఒకసారి ముఖ్యమంత్రిగా చేసి.. ప్రజలు దారుణంగా 11 సీట్లకు పరిమితం చేసిన జగన్మోహన్ రెడ్డి విషయంలో కేవలం 8 నెలల గ్యాప్ లోనే మళ్లీ ఇలాంటి సీఎం నినాదాలు చేస్తే.. తనను వెటకారం చేస్తున్నట్టుగా ఉన్నదని జగన్ అనుకుంటున్నారట.
నిజానికి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలకు పెయిడ్ కూలీలను రాజకీయ సభలకు తరలించినట్టుగా తరలిస్తున్నారు. వచ్చిన వాళ్లు తాము తీసుకున్న కూలీకి ఏదో ఒక ప్రత్యుపకారం చేయాలి కదా అన్నట్టుగా.. ‘సీఎం సీఎం’ నినాదాలు చేస్తున్నారు. కానీ ఈ నినాదాలు విని జగన్ కుమిలిపోతున్నారనే సంగతి పాపం.. వారికి తెలిసినట్టులేదు.
ఇలాంటి అత్యుత్సాహపు నినాదాలు జనంలో కూడా జగన్ ఇమేజిని పలుచన చేస్తున్నాయి. జగన్ కు సీఎం పదవి మీద ఆశ ఉండవచ్చు.. ఆ పదవిలేకపోతే ఆయన ఉండలేకపోవచ్చు.. కానీ ప్రజల తిరస్కారం తరువాత కూడా.. ఇలా నినాదాలు చేయించుకోవడం జగన్ ఆలోచన సరళికి నిదర్శనం అని ప్రజలు అనుకుంటున్నారు.