చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించి ముప్పయ్యేళ్లు పూర్తయ్యాయి. 1995లో సెప్టెంబరు 1 వ తేదీన చంద్రబాబు తొలిసారిగా ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఈ సందర్భాన్ని తెలుగుదేశం నాయకులందరూ ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కూటమి పార్టీలన్నీ కూడా చంద్రబాబును ఘనంగా అభినందించాయి. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇంత సుదీర్ఘ అనుభవం చిన్న విషయం ఏం కాదు. ఈ ముప్పయ్యేళ్లలో ఆయన పదిహేనేళ్లు ముఖ్యమంత్రి పదవిలోనూ, మరో పదిహేనేళ్లు ప్రతిపక్ష నాయకుడిగానూ ఉన్నారు. ఈ రెండు దశల నాయకత్వంలోనూ ఆయన అనేక ఒడిదుడుకులను చవిచూశారు. ఇవాళ సీఎం అయిన సందర్భానికి ముప్పయ్యేళ్లు పూర్తయిన సమయంలో చంద్రబాబునాయుడు తన ఈ అనుభవం నుంచి వేదం లాంటి ఒక అద్భుతమైన మాట చెప్పారు. నిజానికి రాజకీయాల్లో మాత్రమే కాదు.. జీవితంలో ఏ రంగంలో ఉన్నవారైనా సరే.. విధిగా గుర్తుంచుకోవాల్సిన, ఆచరించాల్సిన మాట అది. రాజకీయాల్లో ఉన్నవారికైతే.. ఖచ్చితంగా ఎంతో అవసరమైన మాట!
‘విమర్శలకు భయపడితే అక్కడే ఆగిపోతాం’ అని చంద్రబాబునాయుడు.. ఈ సందర్భంలో సెలవిచ్చారు. నిజంగా ఆణిముత్యం లాంటి మాట ఇది. చంద్రబాబునాయుడు నిజాయితీగా తన జీవితానుభవంలోంచి సారాన్ని పిండి ప్రపంచానికి అందించిన మాటగా దీనిని మనం పరిగణించాలి.
ఎందుకంటే..
తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్ టి రామారావు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో, పార్టీ నాయకత్వం తన చేతిలోకి తీసుకుని చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆనాటి తెలుగుదేశం రాజకీయాలు, క్షేత్రస్థాయి వాస్తవాలు తెలిసిన అందిరికీ.. చంద్రబాబు ఆ పనిచేయడం వల్ల మాత్రమే.. పార్టీ ఇవాళ్టికీ మనుగడలో ఉన్నదనే సత్యం తెలుసు. కానీ చంద్రబాబును రాజకీయ ప్రత్యర్థులు మాత్రం నాటినుంచి నేటివరకు కూడా అనేక రకాల విమర్శలతో నిందిస్తూనే ఉంటారు. ఆ విమర్శలను, నిందలను పట్టించుకోకుండా తన పనేదో తాను చేసుకుంటూ.. రాష్ట్రానికి తాను చేయదలచుకున్నదేదో చేసుకుంటూ ముందుకు వెళ్లారు గనుకనే.. చంద్రబాబునాయుడు ఇవాళ దేశంలో అత్యుత్తమ సీఎంగా ఖ్యాతి గడించగలిగారు. విమర్శలను పట్టించుకుంటు ముందుకు వెళ్లలేం అనే సత్యాన్ని ఆయన జీవితం నుంచి అందరూ నేర్చుకోవాలి. అదే సమయంలో.. ‘అధికారంలో ఉన్నా లేకున్నా.. ప్రజల కోసమే పనిచేశా.. కాబట్టే ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నా’ అని చంద్రబాబు చెప్పిన మాట కూడా ప్రతి నాయకుడు గుర్తుంచుకోవాల్సిన సంగతి. ఈ ముప్పయ్యేళ్లలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని బాబు అన్నారు. ఇప్పటి నాయకులు ఒకసారి ఎన్నికల్లో ఓడిపోతే చాలు.. అయిదేళ్లపాటూ ఇతర నగరాలకు వెళ్లిపోయి వ్యాపారాలు చూసుకుంటూ ఆ తర్వాత ఎన్నికలకు మళ్లీ వచ్చి రాజకీయం చేసే ధోరణితో గడుపుతున్నారు. చంద్రబాబు తన జీవితాన్ని ఈ సందర్భంలో ఈ రకంగా ఆవిష్కరించడం గొప్పగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు.