క్లారిటీ వచ్చింది.. అమరావతి పనులకు పండగే!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చాలా ఉదారంగా 15వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. బడ్జెట్ లో చేసిన ఈ ప్రకటనకు సంబంధించి ప్రజల్లో మాత్రం కొన్ని సందేహాలు మిగిలిపోయాయి. ప్రపంచబ్యాంకు నుంచి ఈఏపీ అప్పుగా తీసుకువచ్చి, ఏపీ రాజధాని కోసం ఇవ్వనున్నట్టు బడ్జెట్ ప్రవేశ పెట్టినాడే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు వెల్లడించారు. యాభయ్యేళ్ల తర్వాత తిరిగి చెల్లించాల్సిన ఆ అప్పును తీర్చే బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిదా? కేంద్రానిదా? అనే క్లారిటీ రాలేదు. తాజాగా రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ఱ ఈ విషయంలో స్పష్టత ఇచ్చారు. ఆ నిధులు పూర్తిగా కేంద్రం అందిస్తున్న గ్రాంటు మాత్రమే అని చెప్పారు. అప్పు తీర్చే బాధ్యత కూడా పూర్తిగా కేంద్రమే తీసుకుంటుందని వివరించారు. దీంతో అమరావతి పనుల విషయంలో ఇదొక పండగ లాంటి వార్త అని చెప్పవచ్చు!
సాధారణంగా ఈ అప్పుడు 90 శాతం కేంద్రం, 10 శాతం రాష్ట్రం భరించాల్సి ఉంటుందని కానీ ఏపీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ వాటాను కూడా కేంద్రమే చెల్లించేలా హామీ ఇచ్చినట్టు వివరించారు. ఈ నిధులు ఈ ఆర్థిక సంవత్సరంలోనే విడుదల కాబోతుండడంతో.. అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగే అవకాశం ఉంది.

కోర్ కేపిటల్ కు సంబంధించి.. ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ వంటి పనులు వేగంగా జరుగుతున్నాయి. అవన్నీ పూర్తయి, తిరిగి నిర్మాణాలు ప్రారంభించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడేలోగా.. ఐకానిక్ సచివాలయం, హైకోర్టు శాశ్వత భవనాల నిర్మణానికి పునాదుల వద్ద ఆగిపోయిన పనుల విషయంలో ఏం చేయాలో ఐఐటీ నిపుణుల నివేదికలు కూడా వచ్చేస్తాయి. నిర్మాణ కసరత్తు ప్రారంభించేలోగానే.. నిధులు కూడా అందుబాటులోకి వస్తాయి. ఇక నిర్మాణాలు శరవేగంగా జరిగే అవకాశం ఉంది.

ఒకవైపు 70 శాతం వరకు పూర్తయిన అధికారుల, ఉద్యోగుల నివాస సముదాయాలు, న్యాయమూర్తుల క్వార్టర్లను పూర్తిచేయాల్సి ఉంది. అలాగే  హ్యాపీ నెస్ట్ పేరుతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన నివాససముదాయాలను ఇప్పటికి పెరిగిన వ్యయం పూర్తిగా సీఆర్డీయే భరిస్తూ కొన్నవారికి ఫ్లాట్లు ఇవ్వాలని చంద్రబాబు ఆల్రెడీ ఆదేశించారు. దీంతో ఆ 1200 ఫ్లాట్ల నిర్మాణాలు కూడా వేగంగా జరగబోతున్నాయి. ఏ రకంగా చూసినా అమరావతి వ్యాప్తంగా రాబోయే అయిదేళ్లపాటు ముమ్మరంగా నిర్మాణ పనులు జరుగుతుంటాయని.. మరోవైపు పోలవరం ప్రాజెక్టుకు కూడా 12 వేల కోట్ల రూపాయలను కేంద్రం రెండు విడతలుగా ఇవ్వబోతున్న నేపథ్యంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందని ప్రజలు సంతోషిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories