మూడు నియోజకవర్గాలను శాసిస్తున్న సికె!

చిత్తూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సికె జయచంద్రారెడ్డి అలియాస్ సికె బాబు.. విస్తృతంగా ప్రజాసంబంధాలు, ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆయన ఎమ్మెల్యేగా నెగ్గి రాజకీయం చేశారు. వైఎస్సార్ అనుచరుడే అయినప్పటికీ.. ఆయన హవా రాజ్యమేలిన ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకపోయేసరికి, ఇండిపెండెంటుగా పోటీచేసి, వైఎస్ హవాను తట్టుకుని నెగ్గిన చరిత్ర సికెబాబుది. అలాంటి సికె బాబు ఇప్పుడు చిత్తూరు నియోజకవర్గ ఎన్నికల్లో  తెలుగుదేశం అభ్యర్థి గురజాల  జగన్మోహన్ కు అనుకూలంగా పనిచేస్తున్నారు. సికె బాబు చాలా కష్టపడి తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తుండడం వల్ల.. తెలుగుదేశం ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే అంచనాలు సాగుతున్నాయి. అయితే ఇంకో ట్విస్టు ఏంటంటే.. కేవలం చిత్తూరు మాత్రమే కాదు.. చిత్తూరు పార్లమెంటు పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశాన్ని గెలిపించే బాధ్యతను సికెబాబు భుజానికెత్తుకున్నట్టుగా తెలుస్తోంది. ఆమేరకు ఆయన తన మాటగా పార్టీకి హామీ ఇచ్చినట్టు సమాచారం.

చిత్తూరు నియోజకవర్గ పరిధిలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఇక్కడ తెలుగుదేశం తరఫున గురజాల జగన్మోహన్ పోటీచేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున సిటింగ్ ఎమ్మెల్యే, కాపు కులానికి చెందిన ఆరణి శ్రీనివాసులును పక్కన పెట్టి.. ఆర్టీసీ ఛైర్మన్ బాధ్యతలు నిర్వర్తించిన ఎంసి విజయానందరెడ్డిని జగన్ ఎంపిక చేశారు. ఆరణి శ్రీనివాసులు అలిగి.. జనసేనలో చేరి, ఆ పార్టీ తరఫున తిరుపతినుంచి పోటీచేస్తున్నారు.


ఆ రకంగా వైఎస్సార్ కాంగ్రెస్ లో ఆరణి శ్రీనివాసులు వర్గం వైసీపీకి వ్యతిరేకంగా తయారైంది. పైగా సికె బాబు.. తెదేపా జగన్మోహన్ కోసం చాలా కష్టపడి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. చిత్తూరుతోపాటు, పూతలపట్టు, గంగాధర నెల్లూరుల్లో కూడా పార్టీని గెలిపిస్తానని ఆయన హామీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఆ రెండు నియోజకవర్గాల మీద కూడా సికెబాబుకు మంచి పట్టు ఉంది. అక్కడ తన వర్గానికి చెందిన నాయకులు అందరినీ పిలిపించుకుని, వారిని తరచూ కలుస్తూ తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేయాల్సిందిగా చెబుతున్నట్లు తెలుస్తోంది. సికె వర్గంలోని కీలక నాయకులు.. ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తున్నారు. మొత్తానికి సీనియర్ నాయకుడు సికెబాబుకు చంద్రబాబు ఎలాంటి హామీ ఇచ్చారో తెలియదు గానీ.. ఆయన మాత్రం తెలుగుదేశం విజయం కోసం గట్టిగా రంగంలో పనిచేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories