సీఐడీ పంజా : మిగిలిన అరెస్టులు త్వరలోనే!

కేసులు సీఐడీపోలీసుల పరిధిలోకి వెళ్లాయి. వారి విచారణ తీరు కొంత భిన్నంగా ఉండవచ్చు. అలాగే.. కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్లు పెద్ద నాయకులు కదా.. వారిని అరెస్టు చేయడం వలన పర్యవసానాలు ఎలా ఉంటాయో ఏమో.. కాస్త ఆచితూచి వ్యవహరిద్దాం అని వారు మొహమాట పడకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో.. అటు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద గానీ, ఉండవిల్లిలోని చంద్రబాబునాయుడు నివాసం మీద గానీ జరిగిన దాడి కేసులు ఇప్పుడు పోలీసు శాఖ నుంచి సీఐడీకి బదిలీ అయ్యాయి. ఈ కేసుల్లో విచారణ వేగవంతంగా జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారు.

జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలు, నాయకులు కన్నూ మిన్నూ కానకుండా ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. దాడులకు తెగబడడం, విధ్వంసం చేయడం అనేది అప్పట్లో వారికి నిత్యకృత్యంగా మారింది. ఒక తెలుగుదేశం నాయకుడు జగన్మోహన్ రెడ్డిని అనుచితంగా తిట్టారనే కోపంతో.. వైసీపీ నాయకులు అల్లరి మూకలను గూండాలను ఉసిగొల్పి.. చంద్రబాబునాయుడు ఇంటి మీదికి, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీదికి దాడికి దిగారు. టీడీపీ ఆఫీసులో విధ్వంసం సృష్టించారు. తెలుగుదేశం వారి ఫిర్యాదు మీద అప్పట్లోనే కేసులు నమోదు అయ్యాయి గానీ పోలీసులు పట్టించుకోలేదు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు తిరగతోడారు. ఈలోగా కీలక నిందితులు అయిన లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, జోగి రమేశ్, సజ్జల రామక్రిష్ణా రెడ్డి వీళ్లంతా కోర్టును ఆశ్రయించి.. ముందస్తు బెయిలు దొరక్కపోయినా, తక్షణ అరెస్టుల నుంచి కాస్త ఉపశమనం పొందారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్ మాత్రం అరెస్టు అయి రిమాండులోనే ఉన్నారు. అవినాష్ ఏకంగా దుబాయి వెళ్లిపోవాలని ప్లాన్ చేసుకుని హైదరాబాదు ఎయిర్ పోర్టులో ఆపేయడంతో వెనక్కు వచ్చారు. అరెస్టు కాని నాయకులను విచారణకు సహకరించాలని కోర్టు చాలా స్పష్టంగా ఆదేశించింది. అయితే పోలీసుల విచారణలో వారు చిత్రమైన సమాధానాలు చెబుతున్నట్టు సమాచారం. తలాతోకా లేకుండా.. అడ్డగోలు సమాధానాలతో కాలయాపన చేస్తూ వచ్చారు. విసిగిపోయిన పోలీసుశాఖ ఇప్పుడు కేసులను సీఐడీకి బదిలీచేసింది.

సీఐడీ విచారణలో ఈ కేసుతో సంబంధం ఉన్నవారందరి అరెస్టులు సత్వరం జరుగుతాయని అంచనాలు సాగుతున్నాయి. అధికారాన్ని అడ్డు పెట్టుకుని చెలరేగిన వారు అరెస్టు అయ్యేది ఎఫ్పుడా అని టీడీపీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories