‘కుక్కల’ కేసులో చిత్ర విచిత్ర వాదనలు

ముంబాయి నటి కాదంబరీ జత్వానిని ఒక కుట్ర ప్రకారంగా కుటుంబ సమేతంగా అరెస్టు చేసి వేధించిన వ్యవహారంలో అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా నడిచిన వ్యవహారం మరింత పక్కాగా వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో స్వయంగా పాత్రధారులు అయినటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతి రానా తాతా, విశాల్ గున్ని ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా వారు చిత్ర విచిత్రమైన వాదనలు వినిపిస్తున్నారు. అయితే అసలే సీనియర్ ఐపీఎస్ అధికారులు స్వయంగా పాత్రధారులు కావడం.. పైగా అప్పట్లో ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా నడిచిన హై ప్రొఫైల్ కుట్ర కావడం కారణంగా వీరికి బెయిలు ఇస్తే సాక్షులను ప్రభావితం చేయగలరని కేసును తారుమారు చేయగలరని ప్రభుత్వ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదిస్తున్నారు.

కాదంబరి జత్వానిని అరెస్టు చేసి వేధించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో ఒక పెద్ద కుట్ర జరిగిన సంగతి అందరికీ తెలుసు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఓడిపోయిన కుక్కల విద్యాసాగర్ ను రంగంలోకి తీసుకువచ్చి ఆయన ద్వారా కాదంబరీ జత్వానిపై కేసు పెట్టించారు. ఫోర్జరీ సంతకాల ద్వారా తన భూములను అమ్మడానికి ఆమె ప్రయత్నించారని కుక్కల విద్యాసాగర్ కేసు పెట్టారు. అంతకుముందే సీఎం నుంచి ఇంటలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు విజయవాడ నగర కమిషనర్ కాంతి రానా తాతాను పిలిపించి కుట్ర రచన చేసినట్టుగా వెలుగులోకి వచ్చింది.

వారు చేసిన పొరపాటు ఏంటంటే కుక్కల విద్యాసాగర్ కేసు పెట్టడానికంటే ముందు రోజే ముంబాయి వెళ్లడానికి పోలీసు అధికారులకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడం. విద్యాసాగర్ కేసు రిజిస్టర్ అయిన సమయానికి పోలీస్ అధికారులు హైదరాబాద్ ఎయిర్పోర్టులో ఉన్నారు. అనగా ఒక వ్యూహం ప్రకారం ముందే అరెస్టుకు అధికారులు బయలుదేరి ఆ తరువాత కేసు నమోదు చేసినట్లుగా తేటతెల్లం అవుతోంది. తనను విశాఖపట్నం బదిలీ చేసినప్పటికీ కాదంబరీ జత్వానీ అరెస్టు వ్యవహారం పూర్తయితే తప్ప రిలీవ్ చేసేది లేదని విజయవాడ నగర్ కమిషనర్ కాంతి రానా తెలియజేసినట్లు విశాల్ గున్ని ఆల్రెడీ శాఖాపరమైన విచారణలో వెల్లడించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ ఇద్దరు ఐపీఎస్ అధికారులు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుని.. కుక్కల విద్యాసాగర్ కు ఆల్రెడీ బెయిల్ ఇచ్చారు గనుక.. తమకు కూడా ఇవ్వాల్సిందేనని వాదిస్తున్నారు. ఈ వాదనలు చాలా కామెడీగా ఉన్నాయి. కాదంబరీ జత్వానీ వ్యవహారంలో జరిగిన పాపం వెనుక కుక్కల విద్యాసాగర్ పాత్రకు, ఈ ఇద్దరు ఐపీఎస్ ల పాత్రకు చాలా తేడా ఉంది. అందరి నేరాలు నిరూపణ అయినాకూడా.. కుక్కలకు పడే శిక్షలకు, వీరికి పడే శిక్షలకు చాలా తేడా ఉంటుంది. అలాంటిది.. వీరిద్దరూ కుక్కలకు బెయిలు ఇచ్చారు గనుక తమకు కూడా కావాలని అడగడమే తమాషా!

Related Posts

Comments

spot_img

Recent Stories