ఈ మధ్య టాలీవుడ్‌లో ఫిల్మ్ ఫెడరేషన్ మరియు నిర్మాతల మండలికి మధ్య విభేదాలు చెలరేగాయి. దాంతో సినిమా కార్మికులు పనులు ఆపి నిరసన తెలుపుతున్నారు. ఈ పరిస్థితిపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఇప్పటికే ప్రకటన చేస్తూ, కార్మికుల వేతనాల పెంపుపై ఇరువర్గాలు ఒక నిర్ణయానికి రావాలని సూచించింది.
ఈ వివాదం కొనసాగుతున్న కాలంలో కొందరు నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని కలిసినట్లు సమాచారం. ఈ సమస్య త్వరగా పరిష్కారం కావడానికి ప్రయత్నిస్తానని ఆయన వారికి చెప్పినట్టు తెలుస్తోంది. కానీ, ఇటీవల కొందరు వ్యక్తులు తమను ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులమని, చిరంజీవితో భేటీ అయ్యామని, ఆయన 30 శాతం వేతన పెంపుకు అంగీకరించారని ప్రచారం జరుగుతోంది.
దీతో ఆయన స్పష్టతనిచ్చారు. ఫిలిం ఫెడరేషన్ సభ్యులు తనను కలవలేదని, ఎవరితోనూ భేటీ కాలేదని తెలిపారు. సినిమా కార్మికుల వేతనాలపై తానే ఒక నిర్ణయం తీసుకోలేనని, ఆ అధికారం ఫిలిం ఛాంబర్‌దేనని చెప్పారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు అందరూ శాంతంగా ఉండాలని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని సోషల్ మీడియాలో చెప్పారు.