జగన్ నైతికతపై ధ్వజమెత్తిన చిన్నమ్మ!

అమ్మకు అన్నం పెట్టని వాడు.. పిన్నమ్మకు పరమాన్నం పెడతానన్నాడుట.. అనేది చాలా పాత సామెత! కానీ సమకాలీన రాజకీయాలను గమనిస్తే.. కొత్త సామెతలను మనమే తయారు చేసుకోవాల్సి వస్తుంది. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడిని చూస్తే.. అమ్మనూ క్షోభ పెడతాడు.. అంతకంటె ఎక్కువగా చిన్నమ్మనూ ఆరళ్లు పెడతాడు అని అనుకోవాల్సి వస్తుంది. వివేకా హంతకుడిగా ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ్ముడు అవినాష్ రెడ్డిని మళ్లీ ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపాలని జగన్మోహన్ రెడ్డి తపన పడిపోతున్నారు. అందుకోసం చెల్లెమ్మలు ఇద్దరినీ తన పార్టీ కార్యకర్తలతో బండబూతులు తిట్టించడానికి గానీ, తన చిన్నాన్న వివేకా వ్యక్తిత్వ హననం చేయడానికి గానీ ఆయన వెనుకాడడం లేదు. అలాంటి జగన్ తన చేతలతో తమ మనసులను ఎంత క్షోభ పెడుతున్నాడో అక్షరాల్లో వివరిస్తూ, జగన్ నైతికతను ప్రశ్నిస్తూ చిన్నమ్మ సౌభాగ్యమ్మ ఆయనకు తాజాగా ఒక బహిరంగ లేఖ రాశారు.

2009లో మీ తండ్రిని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించావో.. 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే వేదన అనుభవించింది. మన కుటుంబంలోని వారే ఈ హత్యకు కారణం కావడం.. వాళ్లకు నువ్వు రక్షణగా ఉండడం ఎంతో బాధించింది. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్నపై నీ సొంత మీడియా పార్టీ వర్గాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి. చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం చేయించడం నీకు తగునా? న్యాయం కోసం పోరాడుతున్న నీ చెల్లెళ్లను హేళన చేస్తున్నారు. సునీతకు మద్దతుగా ఉన్న షర్మిలను కూడా టార్గెట్ చేస్తోంటే నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు ఉంటున్నావు..? అంటూ సౌభాగ్యమ్మ తన లేఖలో ప్రస్తావించారు.
చివరి ప్రయత్నంగా ప్రార్థిస్తున్నా రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రిగా న్యాయం ధర్మంవైపు నిలబడాలని వేడుకుంటున్నా అంటూ సౌభాగ్యమ్మ పేర్కొనడం విశేషం.

చిన్నమ్మ- జగన్ కు రాసిన లేఖ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం అవుతోంది. ఇన్నాళ్లూ కడప జిల్లాలో చెల్లెళ్లు చేస్తున్న పోరాటం, సాగిస్తున్న ప్రచారం అంతా ఒక ఎత్తు కాగా, సౌభాగ్యమ్మ లేఖ ఒక్కటీ మరొక ఎత్తు అని అంతా అనుకుంటున్నారు. ఈలేఖ కడప జిల్లా ప్రజలను ఆలోచింపజేస్తుందని కూడా అంటున్నారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసేలోగా.. వైఎస్ విజయమ్మ కూడా అమెరికా నుంచి ఒక లేఖ ద్వారా గానీ, వీడియో సందేశం ద్వారా గానీ.. జగన్ వైఖరిని తప్పుపడుతూ.. షర్మిలకు అనుకూలంగా ప్రచారం చేస్తారని కూడా ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories