పోలీసులు బతిమాలుతున్నా అతి చేసిన చెవిరెడ్డి!

మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి దళాలు కాజేసిన సొమ్మును.. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారన్న సామెత చందంగా పంచుకున్నట్లుగా ఆధారాలు దొరకడంతో.. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి కూడా అరెస్టు అయ్యారు. దాదాపు మూడున్నర  వేల కోట్ల రూపాయల సొమ్మును లంచాలుగా కాజేసిన ఈ అతిపెద్ద కుంభకోణంలో అరెస్టు అయిన తొలి రాజకీయ నాయకుడు చెవిరెడ్డి కావడం విశేషం. అయితే.. చెవిరెడ్డి భాస్కర రెడ్డిని, ఆయన అనచరుడు వెంకటేశ్ నాయుడును పోలీసులు కస్టడీలో విచారించేందుకు కోర్టు అనుమతించిన నేపథ్యంలో చెవిరెడ్డి ఒక పెద్ద హైడ్రామా నడిపించారు. ఒకవైపు పోలీసులు ఆయనను పదేపదే బతిమాలుతున్నప్పటికీ.. చెవిరెడ్డి మాత్రం.. విచ్చలవిడిగా రంకెలు వేస్తూ.. పోలీసులను విదిలించుకుంటూ మీడియా కెమెరాల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించడం గమనార్హం.

ప్రస్తుతం రిమాండులో ఉన్న చెవిరెడ్డి భాస్కర రెడ్డిని పోలీసులు జైలునుంచి మంగళవారం తీసుకువెళ్తున్న సమయంలో హైడ్రామా నడిచింది. జైలు గేటునుంచి బయటకు వచ్చేవేళకే అక్కడ టీవీ చానెళ్ల విలేకర్లు సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు పోలీసులు ఆయనను కవర్ ఛేస్తూ వాహనంవైపు నడిపించేందుకు ప్రయత్నిస్తుండగా.. చెవిరెడ్డి మాత్రం.. వారిని విదిలించుకుంటూ మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించడం విశేషం. ఒకవైపు పోలీసులు బతిమాలుతున్నా పట్టించుకోకుండా.. ‘నామీద తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారు. దేవుడు ఉన్నాడు. దేవుడు చూసుకుంటాడు. ఈ స్క్రిప్టు వెనుక పెద్ద పెద్ద దర్శకులు ఉన్నారు. రాజమౌళి లాంటి వారున్నారు. పెద్దపెద్ద మహానటులు కూడా ఉన్నారు. వారంతా కలిసి దీనిని నడిపిస్తున్నారు. తన మీద తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కరినీ దేవుడు శిక్షిస్తాడు’ అంటూ చెవిరెడ్డి పెద్దపెద్దగా అరుస్తూ యాగీ చేశారు. ‘నేచర్ ఈజ్ సుప్రీం.. నేచర్ శిక్షిస్తుంది.. గాడ్ ఈజ్ సుప్రీం’ అని పదేపదే రంకెలు వేస్తూ కనీసం ఆయనను తరలిచండానికి తెచ్చిన వాహనం ఎక్కకుండా మొరాయించారు చెవిరెడ్డి.

జైలు గేటు దాటి బయటకు వచ్చిన వెంటనే.. సాక్షి చానెల్ కెమెరా ఎక్కడుందా అని వెతుక్కున్న చెవిరెడ్డి భాస్కర రెడ్డి.. ఆ కెమెరాకేసి చూస్తూ.. చాలా నాటకీయంగా ఈ ఎపిసోడ్ నడిపించారు. ‘‘సర్ ప్లీజ్ సర్.. పదండి సర్.. పదండి సర్.. ప్లీజ్ సర్..’’ అని పోలీసు అధికారులు బతిమాలుతున్నప్పటికీ కూడా.. చెవిరెడ్డి ఈ హంగామా చేయడం చూసిన వారికి చీదరింపు పుట్టించేలా కనిపించింది.

చెవిరెడ్డి మద్యం కుంభకోణంలో తన పేరు బయటకు వచ్చినప్పటినుంచి కూడా.. తనకు ఏ పాపం తెలియదని, తాను ఎన్నికల్లో కూడా డబ్బు గానీ, మద్యం గానీ పంచనేలేదని ఆదర్శాలు వల్లెవేస్తున్నారు. స్వయంగా ఆయన పీఏలు ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు లారీలో హైదరాబాదు నుంచి ఏపీకి తరలిస్తుండగా దొరికిపోయినప్పటికీ కూడా ఆయన ఈరకంగా బుకాయిస్తుండడం విశేషం. అప్పటినుంచి అసలు పూర్తిగా పరారీలోకి వెళ్లిపోయిన ఆయన పీఏలో కూడా  ఇందోర్ లో పోలీసులకు పట్టుబడినప్పటికీ.. ఆయన మాటల్లో దూకుడులో మార్పు రాలేదు. పోలీసులనే రెచ్చగొట్టేలా ఆయన దేవుడు పేరు చెప్పి హంగామా చేయడం విశేషం. 

Related Posts

Comments

spot_img

Recent Stories