అన్నయ్యకు దోచిపెట్టే జగన్ ఆలోచనకు చెక్!

అయినవాళ్లందరికీ విచ్చలవిడిగా దోచిపెట్టడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అయిదేళ్ల పదవీకాలాన్ని ఎంత చక్కగా వాడుకున్నాడో రాష్ట్రప్రజలందరికీ తెలుసు. ఇలా తన ప్రాపకంలో ఉండే ప్రతిఒక్కరికీ దోచుకునే అవకాశాలను అందించిన జగన్..  తనకు అన్నయ్యలాంటి ఆత్మీయుడికి మేలు చేయకుండా ఉంటారా? ‘సరిహద్దులు చెరగిపోయేలా’ మరీ.. అన్నయ్యకు దోచిపెట్టడానికి ఆయన అప్పట్లో అనుమతులు ఇచ్చేశారు. వ్యవహారం ఇంకా కోర్టులో నానుతుండడం వలన ఆ దోపిడీపర్వం ఇంకా మొదలు కాలేదు. ఈలోగా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడింది. ఆ దోచిపెట్టే ప్రక్రియకు ఇప్పుడు వాళ్లు బ్రేకులు వేయబోతున్నట్టుగా కనిపిస్తోంది.

వివరాల్లోకి వెళితే..

బళ్లారి ప్రాంతానికి చెందిన గనుల దందాల్లో కీలక నాయకుడు గాలి జనార్దనరెడ్డి. రాజకీయాల్లో కూడా ఒక వెలుగు వెలిగిన వ్యక్తి ఆయన. ఆయన వైఎస్ జగన్ కు అత్యంత ఆత్మీయుడు అనే సంగతి అందరికీ తెలుసు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి జరిగిన కార్యక్రమంలో గాలి జనార్దన రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఆ సభలోనే.. ఆయన తనకు అన్నయ్య లాంటి వారని జగన్ స్వయంగా ప్రకటించుకున్నారు. అలాంటి అన్నయ్యకు, తనకు అధికారం వచ్చిన తర్వాత ఏ మేలూ చేయకుండా జగన్ ఎలా ఉండగలరు?

అందుకే ఏపీ- కర్నాటక సరిహద్దుల్లో మైనింగ్ చేసుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని..  ఆయన ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ సమర్పించింది. గనుల తవ్వకాల్లో అపరిమిత దందాలు చేసిన గాలి జనార్దనరెడ్డి పుణ్యమాన్ని గనులున్న ప్రాంతంలో ఏపీ- కర్నాటక సరిహద్దులు కూడా చెరగిపోయాయనే సంగతి అందరికీ తెలుసు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం తవ్వకాలను నిలిపేసింది. తర్వాత సర్వే ఆఫ్ ఇండియా వారు సరిహద్దులను గుర్తించారు. సర్వే ఆఫ్ ఇండియా నివేదికకు అనుగుణంగా గాలి కంపెనీలకు మైనింగ్ కు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని జగన్ సర్కారు గతంలో అఫిడవిట్ వేసింది. సర్వే ఆఫ్ ఇండియా వారి నివేదికను అధ్యయనం చేయడానికి అమికస్ క్యూరీని సుప్రీం కోర్టు నియమించింది. ఈ అమికస్ క్యూరీ నివేదికను తాము అధ్యయనం చేయడానికి సమయం కావాలని.. ఆ తర్వాత అనుమతుల విషయం సమీక్షించి.. కొత్త అఫిడవిట్ వేస్తామని ఏపీ సర్కారు చెప్పింది. గాలి చేయదలచుకున్న అనుచిత మార్గాల మేలు కాస్తా.. ఇప్పుడు గాలికి కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories