ప్రచారాలు, పథకాలు, వరాలు ఇవన్నీ ఎలా ఉన్నా కూడా.. ఎన్నికల పోలింగ్ నాడు పోల్ మేనేజిమెంట్ ఎవరు అద్భుతంగా చేయగలిగారు అనేది విజయావకాశాల్ని చాలా వరకు నిర్దేశిస్తుంటుంది. ఆ రోజున బూత్ లను మేనేజ్ చేయడానికి చాలా మార్గాలుంటాయి. వాటిలో పోలీసు వర్గాల సహకారం ద్వారా సాగించే అరాచకాలు కూడా ముఖ్యమైనవి. ఇలాంటి నేపథ్యంలో కడప జిల్లాలో పోలీసుల ద్వారా ఈ ఎన్నికల్లో అరాచకాలు కొనసాగించడానికి, అయిదేళ్ల కిందటి నుంచి వ్యూహాత్మకంగా జగన్ రచించిన వ్యూహాన్ని ఇప్పుడు తెలుగుదేశం భగ్నం చేస్తోంది. అలాంటి అరాచకత్వపు వ్యూహాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తోంది.
కడప జిల్లాలో 2019 తర్వాత పోలీసు శాఖలో నియమితులైన హోంగార్డులను ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా కు లేఖ రాశారు. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో ఆయనకు ప్రెవేటు సెక్యూరిటీగా ఉన్నవారిని, జగన్ దగ్గర పనిచేసిన వారిని అందరినీ, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత.. పోలీసు శాఖలో హోంగార్డులుగా నియమించారని భూమిరెడ్డి ఆరోపించారు.
ఎన్నికల సమయంలో వీరందరూ కూడా అధికారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుందని, బూత్ క్యాప్చరింగ్ వంటి అరాచకాలు జరగడానికి సహకరించే అవకాశం ఉందని, అలాగే కీలక సమాచారాన్ని వైకాపా నాయకులకు చేరవేసే ప్రమాదమూ ఉంటుందని భూమిరెడ్డి ఫిర్యాదు చేశారు. వీరిని ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని, అలా కుదరకపోతే.. 2019 తర్వాత నియమితులైన హోంగార్డులు అందరినీ ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆయన కోరారు.
భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి డిమాండ్ చాలా సబబుగానే కనిపిస్తోంది. ఎందుకంటే.. ఎన్నికల వేళ క్షేత్రస్థాయిలో ఉండే పోలీసుల నుంచి సహకారం ఉంటే.. ఎన్ని అరాచకాలనైనా సునాయాసంగా చేయవచ్చు. జగన్ ప్రెవేటు సెక్యూరిటీ మొత్తం ఇప్పుడు కడప జిల్లాల్లో హోంగార్డులుగా నియమితులైఉన్నమమాట కూడా వింత కాదు.
అసలు ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే.. వాలంటీర్లను కూడా వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేయాలని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈసీని కోరిన సంగతి పాఠకులకు గుర్తుండే ఉంటుంది. అలాంటిది.. వాలంటీర్లనే బదిలీ చేయాలని అంటోంటే.. హోంగార్డులను ప్రత్యేకంగా భూమిరెడ్డి చెప్పినట్టు 2019 తర్వాత కడప జిల్లాలో నియమితులైన వారిని ఆ జిల్లాలోనే ఉంచడం అనేది చాలా దారుణం అని ప్రజలు కూడా అనుకుంటున్నారు.