చార్జిషీట్ దాఖలు.. డిఫాల్ట్ బెయిలుకు నో ఛాన్స్!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిన అయిదేళ్ల కాలంలో.. కొత్త లిక్కర్ పాలసీని రూపొందించి, అమల్లోకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వంలోని వారు దాదాపు మూడున్నర వేల కోట్ల రూపాయల ప్రజాధనం కాజేసిన కేసులో.. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు ప్రిలిమినరీ చార్జిషీట్ ను కోర్టుకు సమర్పించారు. చార్జిషీట్ దాఖలు చేయడంతో.. లిక్కర్ స్కామ్ దర్యాప్తులో ఒక కీలకఘట్టం జరిగినట్లు అయింది. ఇది కేవలం ప్రిలిమినరీ చార్జిషీట్ అని, మరో 20 రోజుల్లోగా మరొక ఛార్జిషీట్ దాఖలు చేస్తామని సిట్ అధికారులు కోర్టుకు నివేదించారు. మొత్తం ప్రాథమిక చార్జిషీటే ఏకంగా 300 పేజీలతో ఉండడం విశేషం. చార్జిషీటు కూడా దాఖలైన నేపథ్యంలో.. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన నిందితులు డిఫాల్ట్ బెయిలు పొందే అవకాశం లేకుండాపోయింది.
మద్యం కేసుల్లో పోలీసులు చురుగ్గా దర్యాప్తు సాగించడం ఏప్రిల్ లో మొదలైంది. ఈ కేసులో ఇప్పటిదాకా 41 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. వీరిలో 11 మందిని అరెస్టు చేశారు. వీరందరినీ కూడా పలుదఫాలుగా రిమాండునుంచి పోలీసు కస్టడీకి తీసుకుని విచారించి వివరాలు రాబట్టారు. వీరితో పాటు ఏకంగా 268 మందిని సాక్షులుగా కూడా విచారించి అనేక వివరాలను నమోదు చేశారు. ఫోన్ కాల్ డేటాలు, గూగుల్ టేకౌట్ టెక్నాలజీ ద్వారా.. ఏ సమయంలో ఏ నాయకులు ఎక్కడ ఉన్నారు వంటి అనేక వివరాలను కూడా పోలీసులు సేకరించారు. వాటన్నింటితో సహా.. వందకు పైగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, డేటా ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరికారలను కూడా కలిపి కోర్టుకు సిట్ అధికారులు అందించారు. మొత్తం 62 కోట్ల రూపాయల సొమ్మును కూడా సీజ్ చేసినట్లు వెల్లడించారు.

మద్యం కుంభకోణం ద్వారా దోచుకున్న మూడున్నర వేల కోట్ల రూపాయలను.. వివిధరూపాల్లోకి మార్చి.. స్వాహా చేసినట్టుగా చార్జిషీట్ లో వివరాలు నమోదు చేశారు. వివిధ బ్యాంకులు, ఆస్పత్రులు, బంగారం కొనుగోళ్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, సినిమాల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా నిర్ధరించారు. అలాగే వేల కోట్ల రూపాయలను విదేశాలకు హవాలా మార్గాల్లో తరలించినట్టుగా కూడా తేల్చారు. విదేశాల్లో రియల్ ఎస్టేట్ ఇన్ ఫ్రా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా కూడా గుర్తించారు.

ఈ మద్యం కుంభకోణంలో వసూళ్ల పర్వం నడిపించిన కింగ్ పిన్, నెట్వర్క్ లీడర్ గా కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నారు. అలాగే మద్యం పాలసీ రూపకల్పన దగ్గరినుంచి.. వసూళ్లు పూర్తి చేయడం.. ఆ మొత్తాలను ఎక్కడికి అందాలో అక్కడకు చేరవేయడం వంటి తుదిదశ పనుల వరకు పైస్థాయిలో పర్యవేక్షణ మొత్తం మాస్టర్ మైండ్ గా పేర్కొంటున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిదే అని కూడా విచారణలో వెల్లడైంది. ఈ చార్జిషీట్ లో కొందరు నిందితులు విచారణలో వెల్లడించిన వివరాల్లో మిథున్ రెడ్డి పేరు కూడా ఉన్నది గానీ.. కుంభకోణంలో ఆయన పాత్ర ఏమిటి? అనేది పోలీసులు తేల్చలేదు. మొత్తానికి అరెస్టు అయిన నిందితులు, సకాలంలో పోలీసులు చార్జిషీటు దాఖలు చేయని కారణంగా డిఫాల్ట్ బెయిలు పొందే అవకాశమే లేకుండా.. ప్రిలిమినరీ చార్జిషీటు దాఖలు చేయడం జరిగిందని ప్రజలు అనుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories