ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను సంపాదించుకున్నవారు.. తమంత తాము ఉద్యోగ ఖాళీలు ఎక్కడ ఉన్నాయో వెతుక్కుని, వాటికి దరఖాస్తు చేసుకుని, ఆ తర్వాత నానా పాట్లు పడి, పోటీలో తమ ప్రతిభను నిరూపించుకుని ఆ ఉద్యోగాలను దక్కించుకోవడం అనేది రివాజు. అయితే.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఈ విషయంలో భిన్నమైన ధోరణిలో యువతకు అద్భుతమైన అవకాశాలు కల్పిస్తోంది. మీకు ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయో చెప్పండి.. ఇంట్లోనే కూర్చుని ఉద్యోగాలు చేసే ఉద్దేశం ఉంటే కూడా చెప్పండి.. అందుకు అనువైన వాతావరణాన్ని, సదుపాయాల్ని కల్పిస్తాం.. ఉద్యోగాలు కూడా ఏర్పాటుచేస్తాం అంటూ ఏకంగా ఒక రాష్ట్రవ్యాప్త సర్వేనే నిర్వహిస్తోంది. బహుశా ఉద్యోగాలు ఇవ్వడం, ఇప్పించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా యువతతో సర్వే నిర్వహించడం అనేది బహుశా ప్రపంచంలో ఇదే ప్రథమం కూడా కావొచ్చు.
వర్క్ ఫ్రం హోం కల్చర్ బాగా విస్తరిస్తున్న ప్రస్తుత సమయంలో ఆ దిశగా ప్రభుత్వం ఇంకా అనేక కార్యక్రమాలు చేపడుతోంది. 18నుంచి 50 ఏళ్ల లోపు వయసు ఉండి, ఆధునిక సాంకేతికాంశాలపై అవగాహన, విద్యార్హత ఉన్న వారికి వర్క్ ఫ్రం హోం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం మంగళవారం సర్వే చేపట్టింది. తగిన విద్యార్హతలు ఉన్నవారు.. ఐటీ మరియు అనుబంధ సంస్థల్లో పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారా? ఇంటినుంచి పనిచేయాలంటే ఎలాంటి సదుపాయాలు కోరుకుుటున్నారు? అనే దిశగా వివరాలు సేకరిస్తున్నారు.
సర్వే ఫలితాల్ని బట్టి.. చిన్న చిన్న పట్టణాలు, నగరాల్లో వర్క్ ఫ్రం హోం కేంద్రాలను ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఒక్కో సెంటర్ లో పాతికమంది వరకు కూర్చునేలా సదుపాయాలు ఏర్పాటుచేస్తే యువతరానికి అక్కడినుంచే ఉద్యోగాలు చేసుకునేలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఆల్రెడీ వర్క్ ఫ్రం ఉద్యోగాలు చేస్తున్నవారు, అలాంటి ఉద్యోగాలు కావాలనే ఆలోచనతో ఉన్నవారి వివరాలను ఈ సర్వే ద్వారా తొలుత సేకరిస్తే.. ఆ తర్వాత.. తదనుగుణంగా ఐటీ కంపెనీలతో కూడా రాష్ట్రప్రభుత్వం సంప్రదించి.. ఆసక్తిగల యువతకు ఈ ఉద్యోగాలు దక్కేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది.